
విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి
నల్లగొండ టూటౌన్: నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లాస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, రైతులందరికీ రుణమాఫీ చేసి, రైతు భరోసా డబ్బులు వెంటనే జమ చేయాలని కోరారు. మిల్లెట్ పంటలను ప్రోత్సహించడంతోపాటు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల ఎరువులను రైతులను అందుబాటులో ఉంచాలని, చెరువులు, కుంటలు, కాల్వలకు మరమ్మతులు చేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, యాసంగి ధాన్యానికి వెంటనే బోనస్ ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్‌రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్, పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్, పిండి పాపిరెడ్డి, గడ్డం మహేష్, కన్మంతరెడ్డి అశోక్‌రెడ్డి, బీపంగి జగ్జీవన్‌రామ్, గుండా నవీన్‌రెడ్డి, సాయన్నగౌడ్, రమణముదిరాజ్, బైరు సత్తయ్య, దాసోజు యాదగిరాచారి తదితరులు ఉన్నారు.