కాసులిస్తేనే కేబుల్!
నల్లగొండ : విద్యుత్ శాఖలో అధికారులు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. వ్యవసాయ కనెక్షన్లకు సంబందించి కేబుల్, కండక్టర్ వైర్ల పంపిణీలో మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ముందుగా మంజూరైన రైతులను వదిలేసి.. ఇటీవల మంజూరైన వారికి కేబుల్, కండక్టర్ వైర్లను అప్పగిస్తున్నారు. ముడుపులకు ఆశపడి సీరియల్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే స్టోర్‌లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
2020 నుంచి రెండు వేల ఎస్టిమేట్లు పెండింగ్..
విద్యుత్ శాఖ నుంచి వ్యవసాయ కనెక్షన్ తీసుకున్న రైతులకు కండక్టర్ వైరు (సబ్‌స్టేషన్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌కు వచ్చేది), కేబుల్‌వైరు (ట్రాన్స్‌ఫార్మర్ నుంచి రైతు బావి, బోరు వరకు స్తంభాల మధ్య లాగేది) ఇస్తుంది. రైతులు తమ వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఆ దూరాన్ని బట్టి కేబుల్ వైర్, అవసరాన్ని బట్టి కండక్టర్ వైర్‌ను విద్యుత్ శాఖ సరఫరా చేయాల్సి ఉంటుంది. 2020 నుంచి దరఖాస్తు చేసుకున్న రైతులకు వారి ఎస్టిమేట్ల ఆధారంగా విద్యుత్ శాఖ మంజూరు చేస్తూ వచ్చింది. 2020 నుంచి 2025 వరకు దాదాపు 2 వేల ఎస్టిమేట్ల వరకు రైతులకు కేబుల్, కండక్టర్ వైరు పెండింగ్‌లో ఉంది. ఇటీవల ప్రభుత్వం పెద్ద మొత్తంలో కేబుల్, కండక్టర్ వైర్లను విడుదల చేసింది. అయితే మొదట మంజూరైన రైతులకు కాకుండా.. వెనుకాల మంజూరైన రైతులకు వైర్లను ఇస్తూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మధ్యలో కొందరిని తప్పించి..
2020 జూన్ నెల నుంచి కేబుల్, కండక్టర్ వైర్లు మంజూరైనా పంపిణీ చేయలేదు. ఇటీవల ప్రభుత్వం నుంచి వైర్లు రావడంతో నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ అధికారులు స్టోర్ పంపిణీ ప్రారంభించారు. మొదట 2023 జూలైలో దరఖాస్తు చేసుకున్న ఒకరికి 250 మీటర్ల వరకు వైర్ ఇచ్చారు. ఆ రైతు కంటే ముందు దాదాపు 250 మంది వరకు రైతులు ఉన్నారు. వారికి ఇవ్వకుండా వెనుకాల మంజూరైన రైతుకు ఇచ్చారు. ఆ తర్వాత మధ్యలో చాలా మందిని వదిలేసి 2024 మార్చిలో మంజూరైన రైతుకు 100 మీటర్లు ఇచ్చారు. ఇలా 2020 నుంచి 2025 మే 2వ వారం వరకు మధ్య చాలా మంది రైతులను వదిలేసి వెనుక మంజూరైన వారికి కేబుల్, కండక్టర్ వైరు ఇచ్చారు.
ముడుపులు ఇచ్చిన వారికేనా!
ముడుపులు ఇచ్చిన వారికే స్టోర్ నుంచి కేబుల్, కండక్టర్ వైర్ అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. మంజూరైన రైతులకు సీరియల్ ప్రకారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో స్టోర్ అధికారుల చేతివాటం ప్రదర్శించారనే విషయం స్పష్టమవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల స్టోర్ అధికారుల వ్యవహారం ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైందని పలువురు అంటున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి ముందుగా మంజూరైన రైతులకు కేబుల్, కండక్టర్ వైర్లను ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఫ కేబుల్, కండక్టర్ వైరు పంపిణీలో నిబంధనలు పాటించని విద్యుత్‌శాఖ
ఫ సీరియల్ తప్పించి ఇష్టానుసారంగా అప్పగింత
ఫ 2020లో మంజూరైన రైతులను వదిలేసి 2025 వారికి ఇచ్చిన
స్టోర్ అధికారులు
ఫ ముడుపులు ఇచ్చే వారికే
ముట్టజెపుతున్నారని ఆరోపణలు
పొరపాటు జరిగితే సరిచేస్తాం
కేబుల్, కండక్టర్ వైర్ల బాధ్యత డీఈ, ఏఈలకు అప్పగించా. జిల్లాలో 38 విద్యుత్ సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్‌కు 3 కిలో మీటర్ల చొప్పన అందరికీ సీనియార్టి ప్రకారం ఇవ్వాలని చెప్పాం. డీఈలు, ఏఈలు చెప్పిన విధంగా మెటీరియల్ ఇవ్వాలని సూచించారు. ముందు మంజూరైన రైతులకు కాకుండా వెనుక మంజూరైన రైతులకు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరిపి ముందు మంజూరైన రైతులకు వైరు ఇస్తాం.
– ఎస్‌ఈ వెంకటేశ్వరు


