
సందిగ్ధంలో డిగ్రీ విద్యార్థులు!
భువనగిరి: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరి ధిలో ఈనెల 14నుంచి జరగాల్సిన పరీక్షలపై విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన బకాయిలు విడుదల చేసే వరకు పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు మరో సారి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు తెలియజేసేందుకు శుక్రవారం వారితో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
గత కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ కళాశాలలు యాజమాన్యాలు కొంతకాలంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మంత్రులు, ఉన్నత విద్యామండలి అధికారులను కలిసి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో గత నెల 1నుంచి జరగాల్సిన ప్రాక్టికల్స్, 11నుంచి ప్రారంభం కావాల్సిన సబ్జెక్ట్ పరీక్షలను నిర్వహించబోమని చేతులెత్తేశాయి. కాగా ఈ నెల 14నుంచి 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ఈ నెల 6న షెడ్యూల్ విడుదల చేశారు. కానీ, పరీక్షలు నిర్వహించే పరిస్థితుల్లో తాము లేమని ప్రైవేట్ కళాశాలలు మరోసారి స్పష్టం చేయడంతో పరీక్షలు ప్రారంభం అవుతాయా.. లేదోనని విద్యార్థుల్లో సందిగ్ధం నెలకొంది.
ఉన్నత చదువులకు ఇబ్బందులు
ఫీజు బకాయిలు, పరీక్షలకు ముడిపెట్టవద్దని యూనివర్సిటీ అధికారులు కళాశాలల యాజమాన్యాలకు నచ్చజెబుతున్నా సేసేమిరా అంటున్నాయి. పీజీ ఇతర ఉన్నత చదువుల ప్రవేశాలకు డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు కీలకం. డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు త్వరగా రాస్తే వివిధ రకాల ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావచ్చన్న ఆశతో విద్యార్థులు ఉన్నారు. కానీ, తాజా పరిణామాలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
విధిలేని పరిస్థితుల్లోనే నిర్ణయం
గత కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయడం లేదు. దీంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారింది. విధిలేని పరిస్థితుల్లోనే పరీక్షల నిర్వహణకు ముందుకు రావడం లేదు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించి రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి.
–బి.సూర్యనారాయణరెడ్డి, తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఫ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఎంజీయూ
ఫ బహిష్కరిస్తున్నట్లు మరోసారి ప్రకటించిన ప్రైవేట్ కాలేజీలు
ఫ ఆందోళనలో 15 వేల మంది విద్యార్థులు
59 ప్రైవేట్ కళాశాలలు
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 72 కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ 9, ఎయిడెడ్ 2, అటానమస్ 2, ప్రైవేట్ కళాశాలలు 59 వరకు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ , తృతీయ సంవత్సరం విద్యార్థులు 15 వేల వరకు ఉన్నారు. వీరంతా పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు.