
ఎగుమతికి లారీలేవీ?
ధాన్యం లిఫ్ట్ కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతుల నిరీక్షణ
తూకం వేసిన ధాన్యం
బస్తాలు కల్లాల్లోనే..
● లారీల కొరతతో కొన్నిచోట్ల కాంటాలు కూడా వేయడం లేదు
● 750 లారీలకు..
రోజూ నడుస్తున్నవి 150 లారీలే..
● లారీలు లేని వారికి ధాన్యం
ఎగుమతి కాంట్రాక్టులు
● ధాన్యం ఎగుమతి అయినా..
మిల్లుల వద్ద కూడా కొర్రీలు
● పంట అమ్ముకునేందుకు
రైతులకు సవాలక్ష కష్టాలు
పక్షం రోజులుగా నిరీక్షణ
కొప్పోలు ధాన్యం కొనుగోలు కేంద్రానికి 200 బస్తాల ధాన్యం తెచ్చి పక్షం రోజులుగా ఎదురుచూస్తున్నా. లారీల సరిపడా రాక కాంటా వేయడం ఆలస్యం అవుతోంది. పట్టాల ఖర్చు భారమవుతోంది. అడపాదడపా కురిసే అకాల వర్షం, గాలి దుమారానికి పట్టాలు లేచి పోకుండా రాశిని కనిపెట్టుకుని ఉండాల్సి వస్తోంది.
– జెల్లా రాజయ్య, కొప్పోలు, గుర్రంపోడు
బస్తాకు 3 కిలోలు కోత
తూకం వేసేప్పుడు 40 కిలోల బస్తాకు కిలో ఎక్కువగా జోకుతున్నారు. ధాన్యం మిల్లుకుపోయిన తర్వాత తాలు పేర అక్కడ మిల్లర్ 2 కిలోలు కోత పెడుతుండు. లేదంటే ధాన్యం దించుకోవడం లేదు. కోతకు ఒప్పుకుంటేనే ట్రక్‌షీట్ ఇస్తున్నారు.
– సత్తయ్య, నల్లగొండ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. అధికారుల అజమాయిషీ లేకపోవడంతో ధాన్యం కల్లాలకు తెచ్చిన రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నిర్ధేశిత తేమ శాతం వచ్చినా తూకం వేయక, వేసినా కూడా లారీలు రాక రోజుల తరబడి ఆ కళ్లాల వద్దే పడిగాపులు కాయాల్సిన వస్తోంది. కొన్ని చోట్ల లారీ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో రైతులే వాహనాలను పెట్టుకొని ధాన్యం తరలించాల్సి వస్తోంది. ఆ తరువాత ట్రక్ షీట్ ఆలస్యంగా రావడం, చివరకు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు రావడం కూడా 20 రోజులపైనే పడుతోంది.
కొర్రీలు పెట్టి కోత విధిస్తున్నారు
కల్లాలలో తూకం వేసేప్పుడు బస్తాకు కిలో అధికంగా తూకం వేస్తుండగా, తూకం వేసిన ధాన్యం మిల్లరు వద్దకు తీసుకెళ్లాక, ధాన్యం బాగలేదంటూ దిగుమతి చేసుకోకుండా కొర్రీలు పెడుతున్నారు. దీంతో సంబందిత కొనుగోలు కేంద్రానికి మిల్లర్లు ఫలానా రైతు ధాన్యం బాగలేదని చెప్పడం, దీంతో నిర్వాహకులు నీ ధాన్యం బాగలేదంట.. బస్తాకు 2 కిలోలు మిల్లర్లు కోత వేస్తారట.. లేదంటే నీ ఇష్టం అని చెబుతుండటంతో రైతులు అందుకు అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా 40 కిలోల బస్తాకే 3 కిలోల చొప్పున రైతును దోపిడీ చేస్తున్నారు. అందుకు ఒప్పుకుంటేనే ట్రక్ షీట్ రైతుకు అందుతోంది. అప్పుడే ఆ ట్రక్ షీట్ ఆధారంగా రైతు ఎంత విక్రయించారన్న వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. లేదంటే ధాన్యం వెనక్కి పంపిస్తామంటూ బెదిరిస్తున్నారు.
మిల్లర్లు ఆడిందే ఆట..
మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. అసలే కాంట్రాక్టర్లు కొద్దిపాటి లారీలను ధాన్యం రవాణాకు పంపిస్తున్నారు. అయితే ధాన్యం దిగుమతి చేసుకోలేమంటూ నల్లగొండ చుట్టుపక్కల ఉన్న మిల్లర్లు రెండు మూడు రోజులు కొర్రీలు పెట్ట డంతో నల్లగొండ ధాన్యాన్ని మిర్యాలగూడ, దేవరకొండ మిల్లులకు తరలించినట్లు సమాచారం. అంటే ఇటు ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు కూడా ప్రభుత్వంపై అదనంగా పడుతున్నాయి. మొత్తంగా ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అధికారుల అజమాయిషీ పక్కాగా లేకపోవడంతో మిల్లర్లు చెప్పిందే వినాల్సి వస్తోంది. కాగా, రోజుకు ఒక్కో కల్లానికి రెండు చొప్పున నల్లగొండ జిల్లాలోని 375 కేంద్రాలకు దాదాపు 700 లారీలను పంపించాల్సి ఉన్నా రెండు మూడు రోజులకు ఒకటి చొప్పున 150 లారీలు కూడా రాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో లారీ కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయిలో లారీలు లేకున్నా టెండర్లు దక్కించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
● కట్టంగూరు మండలం అయిటిపాముల కేంద్రంలో రెండు రోజుల కిందట కాంటా వేసిన ధాన్యాన్ని మంగళవారం ఒక లారీలో తరలించారు. రోజుకు ఐదు లారీల ధాన్యం తరలించాల్సి ఉండగా ఒకటి, రెండు లారీలే వస్తున్నాయి.
● శాలిగౌరారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సోమవారం తూకం వేసిన 12,700 బస్తాల ధాన్యం.. లారీలు రాకపోవడంతో మంగళవారం సాయంత్రం వరకు ఎగుమతులు కాలేదు. అందులో ిపీఏసీఎస్ ఆధ్వర్యంలో 8,900 బస్తాలు, ఎఫ్‌ిపీఓ ఆధ్వర్యంలో 3,800 బస్తాల ధాన్యం నిల్వలు ఉన్నాయి. అందులో శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలోని పీఏసీఎస్ కేంద్రంలోనే అత్యధికంగా 4వేల బస్తాలు నిల్వ ఉన్నాయి.
● చందంపేట మండలంలోని పోలేపల్లి స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 20 రోజుల నుంచి సరిగ్గా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. నిర్దేశిత తేమ శాతం వచ్చినా జాప్యం చేస్తున్నారు. లారీల కొరత కారణంగానే ఆలస్యం చేస్తున్నారు. మిల్లు వద్ద ఒక లారీని అన్‌లోడ్ చేయాలంటే మూడు రోజులు పడుతోందని చెబుతున్నారు.
● గుర్రంపోడు మండలంలో లారీల కొరతతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 90 శాతం ధాన్యం తేమశాతం వచ్చినా లారీలు రాకపోవడంతో కాంటాలు వేయడం లేదు. ఒక్క కొప్పోలు కేంద్రంలోనే 40 లారీల ధాన్యం కొనుగోళ్లుకు సిద్ధంగా ఉంది. రోజు నాలుగైదు లారీలు రావాల్సి ఉండగా ఒకటి, రెండు మాత్రమే వస్తుండటంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి.
లారీల సమస్యకు
ఇవీ ఉదాహరణలు

ఎగుమతికి లారీలేవీ?

ఎగుమతికి లారీలేవీ?

ఎగుమతికి లారీలేవీ?

ఎగుమతికి లారీలేవీ?

ఎగుమతికి లారీలేవీ?