
ప్రభుత్వ భూమి ఆరకమణ
గట్టుప్పల్ : ఆనాటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా 25 ఏళ్లుగా ప్రభుత్వ భూమి నిరుపయోగంగా మారింది. ఆ భూమిపై కన్నేసిన పక్కన వ్యవసాయ భూమి కలిగిన ఓ వ్యకి ఎకరం వరకు ఆక్రమించుకున్నాడు. కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఆక్రమణకు గురికావడంపై ఆ గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన భూమిని కాపాడాలని రెవెన్యూ అధికారుల చుట్టూ నెలలుగా తిరుగుతూనే ఉన్నారు. అయితే అనేక కారణాలు చూపిస్తూ అధికారులు కాలయాపన చేస్తున్నారు తప్ప పట్టించుకోవడం లేదని యువకులు ఆరోపిస్తున్నారు. గట్టుప్పల్ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న వెల్మకన్నె గ్రామంలో 1999 సంవత్సరంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రైవేట్ వ్యక్తులు నుంచి ప్రధాన రహదారికి ఆనుకుని ప్రభుత్వం ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఆనాడు హద్దురాళ్లు నిర్ణయించి పేదలకు పంచేందుకు ప్లాట్లను కూడా అధికారులు చేశారు. కానీ గ్రామంలో సఖ్యత లేకపోవడంతో వాయిదాలు పడుతూ వచ్చింది.
అధికారుల తప్పిదం..
ఆనాడు ప్రధాన రహదారి వెంట సర్వే నంబర్ 56, 57లలో ఆరు ఎకరాలను రెవెన్యూ అధికారులు గుర్తించి ప్రతిపాదనలు పంపిస్తే.. ప్రభుత్వం ఆ భూమిని కొనుగోలు చేసింది. అధికారులు మాత్రం 55 సర్వే నంబర్‌లోని 6 ఎకరాలను పేదలకు పొజిషన్ చూపించారు. కొనుగోలు చేసింది ఓ సర్వే నంబర్ కాగా.. పొజిషన్ మరో సర్వే నంబర్ అనే విషయం ఆనాడు పేదలకు తెలియక ఇదే భూమి కదా అని ఒప్పుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగింది. అయితే ఇదే భూమి పక్కనే ఉన్న ఓ రైతు వేరే సర్వే నంబర్ భూమిని పట్టా చేయించుకుని 55 సర్వే నంబర్‌లోని పేదలకు సంబంధించిన భూమిని ఆక్రమించుకున్నాడు. దీంతో గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఎలా ఆక్రమించుకుంటారని గ్రామ యువకులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే తహసీల్దార్, ఆర్డీఓ కలెక్టర్‌లకు ఆ యువకులు వినతి పత్రాలు అందజేశారు.
ఫిర్యాదు చేసిన యువకులు
గ్రామ యువకుల ఫిర్యాదు మేరకు జనవరి నెలలో తహసీల్దార్ రాములు ఆ భూమిలో సర్వేయర్‌తో నేరుగా సర్వే చేయించారు. ఆరు ఎకరాల భూమిలో 10 గుంటల వరకు దేవాలయానికి పోను మిగిలిన భూమిలో ఎకరం వరకు ఆక్రమణకు గురైందని అధికారులు తేల్చారు. భూమి ఆక్రమించిన రైతుకు నోటీసులు ఇస్తే సమయానికి హాజరు కాలేదని తహసీల్దారు చెబుతున్నారు.
పేదలకు ఇళ్ల పట్టాలు
ఇచ్చేందుకు గతంలో కొనుగోలు
గ్రామంలో సఖ్యత లేకపోవడంతో పట్టాలు ఇవ్వని అధికారులు
ఇదే అదనుగా భూమిని
ఆక్రమించిన ఓ వ్యక్తి
ఫిర్యాదులు చేసినా
పట్టించుకోని అధికారులు