
అనుమతి లేని పాఠశాలల ప్రచారానికి బ్రేక్
విద్యార్థుల తల్లిదండ్రులు
జాగ్రత్త వహించాలి
అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దు. పిల్లలను పాఠశాలల్లో చేర్పించేటప్పుడు ఆ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతి ఉందా.. లేదా అని నిర్ధారించుకున్న తర్వాత చేర్పించాలి. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. – భిక్షపతి, డీఈఓ
నల్లగొండ: జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటూ విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. వాటిని గుర్తించిన విద్యాశాఖ పాఠశాలల ప్రచారానికి బ్రేక్ వేస్తూ ప్రకటన చేసింది. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దంటూ ప్రకటన విడుదల చేసింది. జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించుకునేందుకు పాఠశాలలకు సెలవులు రాకముందు నుంచే టీచర్లను ఊళ్లలోకి పంపి కాన్వసింగ్ నిర్వహిస్తున్నాయి. ఒక్కో ఉపాధ్యాయునికి టార్గెట్ ఇస్తూ యాజమాన్యలు గ్రామాల్లోకి పంపుతున్నాయి. కొన్ని పాఠశాలలు పదో తరగతి ఫలితాల తర్వాత విస్తృత ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మభ్య పెట్టి పాఠశాలల్లో చేర్పించే పనిలో ఉన్నాయి.
అనుమతి లేని పాఠశాలలు ఇవే..
జిల్లాలోని పలు అనుమతి లేని పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించుకుంటున్నాయి. దీంతో కొందరు విద్యాశాఖకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన డీఈఓ భిక్షపతి నల్లగొండ పట్టణంలోని రవీంద్రగర్‌లో గల జయ హైస్కూల్, హాలియాలోని శ్రీచైతన్య హైస్కూల్, దేవరకొండలోని శ్రీచైతన్య హైస్కూళ్లకు అనుమతి లేదంటూ ప్రకటన విడుదల చేశారు.
మూడు పాఠశాలలకు అనుమతి లేదని విద్యాశాఖ ప్రకటన

అనుమతి లేని పాఠశాలల ప్రచారానికి బ్రేక్