బడ్జెట్‌లో మనకు ఎంత? | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో మనకు ఎంత?

Mar 19 2025 1:49 AM | Updated on Mar 19 2025 1:48 AM

నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి ఏ మేరకు నిధులు వస్తాయో బుధవారం తేలనుంది. నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఆశతో ఉన్నారు. 3.11 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే కీలక ప్రాజెక్టు డిండి ఎత్తిపోతల పథకానికి ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై ఆశలు నెలకొన్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్‌ నుంచే డిండికి నీటిని తీసుకునేందుకు ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.1800 కోట్లతో దానికి సంబంధించిన పనులను చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. మరోవైపు డిండి కింద నిర్మిస్తున్న ఏడు రిజర్వాయర్లకు, కాలువలకు నిధుల అవసరం ఉంది. గత బడ్జెట్‌లో వాటికి రూ.300 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌లో వాటికి అధిక కేటాయింపులు ఉంటాయని రైతులు భావిస్తున్నారు.

ఏఎంఆర్‌పీ లైనింగ్‌కు..

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు (ఏఎమ్మార్పీ) పరిధిలోని కాలువల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. సాగునీటిపారుదల శాఖ కూడా దాదాపు రూ. 400 కోట్లతో ప్రధాన కాలువ లైనింగ్‌ కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ప్రధాన కాలువ లైనింగ్‌ దెబ్బతినడంతోపాటు కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటరీలకు లైనింగ్‌ లేకుండాపోయింది. కాలువలు కంపచెట్లతో నిండిపోయి చివరి ఆయకట్టు నీరందని పరిస్థితి నెలకొంది. అలాగే బ్రాహ్మణవెల్లెంల కాలువల పూర్తికి, నాగార్జునసాగర్‌ పెండింగ్‌ పనులకు, పాత ఎత్తిపోతల పథకాలకు నిధుల అవసరం ఉంది.

కాళేశ్వరం, మూసీ కాల్వలకు..

యాదాద్రి జిల్లాల్లో బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు బాధితులకు రూ.200 కోట్ల పరిహారం రావాల్సి ఉంది. బునాదిగానికాల్వ, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, మూసీ కాలువల ఆధునికీకరణకు నిధులన ఇస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే ఈ బడ్జెట్‌లో ఈ మేరకు వస్తాయనేది తేలనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న గందమళ్ల రిజర్వాయర్‌ నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయింపులపై ఆశలు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్‌ రెండోదశ చివరి ఆయకట్టు భూములకు నీరందించేందుకు కాల్వల అధునీకరణకు చర్యలు చేపడుతుందా? లేదా? తేలనుంది. వీటితోపాటు ఆస్పత్రుల అప్‌గ్రెడేషన్‌, జూనియర్‌, డిగ్రీ కాలేజీల మంజూరు వంటి అంశాలపై జిల్లా ప్రజలు డిమాండ్లు ఉన్నాయి.

యూనివర్సిటీకి నిధులు వచ్చేనా?

మహత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి ఈసారైనా అధిక మొత్తంలో ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందా? లేదా చూడాలి. గత ఏడాది కేవలం నిర్వహణ పద్దు కింద రూ.34.08 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈసారి రూ.309 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం ఏమేరకు బడ్జెట్‌ కేటాయిస్తుందో బుధవారం తేలనుంది.

ఫ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కేనా..

ఫ డిండి, ఏఎమ్మార్పీ, మూసీ కాలువలకు నిధులు వచ్చేనా..

ఫ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులపై ఆశాభావం

ఫ టన్నెల్‌ పనులపై స్పష్టత వచ్చే అవకాశం

టన్నెల్‌ పనులపై..

జిల్లాలో దాదాపు 4లక్షల ఎకరాలకు సాగునీరందించే ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం ప్రాజెక్టు పనులపై ఈ బడ్జెట్‌లో కొంత స్పష్టత రానుంది. ఇటీవల టన్నెల్‌ ఇన్‌లెట్‌ 14వ కిలోమీటర్‌ వద్ద కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులను కొనసాగిస్తుందా? లేదా అన్నది తేలనుంది. గత బడ్జెట్‌లో మాత్రం ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రూ.798 కోట్లు కేటాయించింది. గ్రీన్‌ చానల్‌ ద్వారా నిధులను ఇచ్చి పూర్తి చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి, రీడిజైన్‌ వంటి అంశాలపై స్పష్టత వస్తుందని సాగునీటి శాఖ అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement