కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ

Mar 11 2025 2:05 AM | Updated on Mar 11 2025 2:04 AM

తీర్పులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తీరు భేష్‌

ప్రణయ్‌ హత్య అనంతరం తండ్రి బాలస్వామి మిర్యాలగూడ వన్‌టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రణయ్‌ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు కేసు వాదించేందుకు దర్శనం నరసింహను స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పబ్లిక్‌ ప్రోసిక్యూటర్‌ బలమైన సాక్షాధారాలు సేకరించారు. నిందితుల ఫోన్‌కాల్‌ డేటా, లోకేషన్‌, సీసీ టీవి ఫుటేజీలను సేకరించి.. 472 పేజీల లిఖిత పూర్వక రిపోర్టును కోర్టుకు సమర్పించారు.

ఏ2 సుభాష్‌కుమార్‌శర్మకు మరణశిక్ష

ఏ3 నుంచి ఏ8 వరకు

ఆరుగురికి జీవితఖైదు

తీర్పుకోసం భారీగా తరలివచ్చిన

ప్రజాసంఘాల నాయకులు

కన్నీటి పర్యంతమైన నిందితుల

కుటుంబీకులు

కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు

రామగిరి(నల్లగొండ): సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య కేసులో తుదితీర్పు నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి నల్లగొండ కోర్టు వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ కేసు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు, రెండవ అదనపు జడ్జి ఎన్‌.రోజారమణి సోమవారం అంతిమ తీర్పు వెల్లడించారు. సెప్టెంబర్‌ 14, 2018న ప్రణయ్‌ హత్యకు గురికాగా.. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్‌ విచారణ జరిపి హత్య కేసులో ప్రమేయం ఉన్న 8 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దర్శనం నరసింహ హత్య కేసులో అన్ని సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. నరసింహ వాదనలతో ఏకీభవించిన నల్లగొండ ఎస్సీ, ఎస్టీ రెండవ అనదపు జడ్జి ఎన్‌.రోజారమణి ఏ2 సుభాష్‌కుమార్‌శర్మకు ఉరిశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా లేదా 4 నెలల జైలు శిక్ష, మిగిలిన ఆరుగురు ఏ3 అజ్గర్‌అలీ, ఏ4 మహ్మద్‌ అబ్దుల్‌బారీ, ఏ5 అబ్దుల్‌ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్‌, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ.నిజాంకు జీవిత ఖైదు రూ.10 వేల జరిమాన లేదా 4 నెలల జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 నిందితుడు అమృవర్షిణి తండ్రి తిరునగరు మారుతీరావు 2020 మార్చి 8న ఆత్మహత్య చేసుకోగా.. అజ్గర్‌అలీని అహ్మదాబాద్‌ సబర్మతి జైలుకు, శుభాష్‌కుమార్‌శర్మను చర్లపల్లి జైలుకు తరలించారు. మిగిలిన ఐదుగురు నిందితులకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. ఈ తీర్పుతో ప్రణయ్‌ కుటుంబ సభ్యులు, పలువురు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

భారీగా తరలిన వచ్చిన

ప్రజా సంఘాలు, ప్రజలు..

ప్రణయ్‌ హత్య కేసు తీర్పు సోమవారం వెలువడుతుందన్న విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులతో పాటు సామాన్య ప్రజలు నల్లగొండ కోర్టు వద్దకు భారీగా తరలివచ్చారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి తీర్పు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వేచిచూశారు.

నిందితుల కుటుంబాల కన్నీటి పర్యంతం..

హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురికి శిక్ష పడింది. దీంతో నిందితుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు ఆవరణలో తిరునగరు శ్రవణ్‌కుమార్‌ కూతురు శృతి బోరున విలపించింది. తన తండ్రికి ఎలాంటి నేరం చేయలేదని అయినప్పటికీ శిక్ష పడిందంటూ కన్నీరు పెట్టుకుంది. వీరితో పాటు మిగతా నిందితుల కుటుంబ సభ్యులు కూడా కోర్టు వద్ద, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో వారితో మాట్లాడుతూ, అనంతరం వాహనంలో తరలిస్తున్న క్రమంలో కన్నీరు పెట్టుకున్నారు.

కోర్టు ప్రాంగంలో పోలీసుల భారీ బందోబస్తు..

ప్రణయ్‌ హత్య కేసులో తుది తీర్పు నేపథ్యంలో నల్లగొండ కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు లోపలికి ఎవరినీ రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. న్యాయవాదులు, సిబ్బందిని, కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు.

కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ1
1/2

కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ

కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ2
2/2

కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement