నల్లగొండ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈనెల 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యక్షతన సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబునాయక్, కొంకతి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు, భూములకు సంబంధించిన కేసులపై సమీక్షిస్తారని పేర్కొన్నారు. 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కమిషన్ సూర్యాపేట నుంచి నల్లగొండకు చేరుకొని సాయంత్రం 5.30 వరకు కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. నల్లగొండ నుంచి బయలుదేరి 6.30కు నాగార్జునసాగర్ వెళ్లి అక్కడే రాత్రి బస చేసి 12న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సాగర్‌లో ఇరిగేషన్, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకు కొండమల్లేపల్లి మండలం పిలియాతండాకు వెళ్లి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ వెళ్తారని తెలిపారు.
స్వేరోస్ సభను
విజయవంతం చేయాలి
నల్లగొండ : ఖమ్మంలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న స్వేరోస్ సభను విజయవంతం చేయాలని స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ పాండు కోరారు. సభ పోస్టర్‌ను ఆదివారం నల్లగొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు భీమ్ దీక్ష పవిత్ర మాసంగా జరుపుకుంటామని తెలి పారు. కార్యక్రమంలో కుక్కముడి శ్రీను, రత్నకుమారి, యాదమ్మ, ఎల్లేష్, నాగుల జ్యోతి, వినోద్, చొక్కమ్మ, మర్రి నాగయ్య, మేడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎయిమ్స్ వార్షికోత్సవం
బీబీనగర్ : మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్య కళాశాల 5వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించనున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు, సాయింత్రం 7 గంటలకు వేడుకలకు ప్రారంభం కానున్నాయని, ముఖ్య అతిథిగా పద్మ విభూషణ్, ఏఐజీ ఆస్పత్రి ఫౌండర్, చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు.
అడవులు, ఖనిజ
సంపదను కాపాడాలి
భానుపురి(సూర్యాపేట): అడవులు, ఖనిజ సంపదను కాపాడాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్ నారాయణరావు అన్నారు. వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేటలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఆదివాసుల హక్కులను కాలరాస్తూ పాలిస్తున్నాయన్నారు. అడవుల్లోని ఖనిజ సంపదను దేశీయ, విదేశీయ కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, న్యాయవాది తల్లమల్ల హసేన్, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ జిల్లా కన్వీనర్స్ భద్రయ్య పాల్గొన్నారు.
సూర్యక్షేత్రంలో
ప్రత్యేక పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయ సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. ఆ తర్వాత యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని వీరహనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాదసత్రంలో ఆదిత్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
11, 12 తేదీల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన