అన్ని రంగాల్లో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో అభివృద్ధి

Jun 3 2023 1:48 AM | Updated on Jun 3 2023 1:48 AM

- - Sakshi

వెలుగులు నింపుతున్న పథకాలు..

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. దళిత బంధు పథకం ద్వారా జిల్లాలో 517 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందించామన్నారు. పదేళ్ల కాలంలో 65,384 మంది గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశామన్నారు. నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. గంగపుత్రులు, ముదిరాజ్‌ల కోసం జలాశయాలు, చెరువుల్లో చేప పిల్లలను వదులుతున్నామని చెప్పారు. గీత కార్మికుల సంక్షేమం కోసం చెట్ల పన్ను తొలగించడంతోపాటు వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం భూముల్లో ఖర్జూర, ఈత చెట్లు నాటుతున్నామన్నారు. రూ.2016 ఆసరా పింఛన్‌ ఇస్తూ అభాగ్యులకు అండగా నిలస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ద్వారా ఆడపిల్లల పెళ్లికి రూ.1,00116 అందిస్తున్నామన్నారు.

నల్లగొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నల్లగొండలోని గడియారం సెంటర్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. పోలీస్‌ గౌరవవందనాన్ని స్వీకరించారు. కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన సభలో గుత్తా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోపాటు స్వయంపాలన కూడా అదేరోజు ప్రారంభం కావడం చారిత్రాత్మకమన్నారు. స్వయం పాలనతో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశంలోనే మోడల్‌గా.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యా, వైద్యం, సాగు, తాగునీరు, విద్యుత్‌ రంగాల్లో అపారమైన అభివృద్ధిని సాధించామన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక పోలీస్‌ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా పోలీస్‌ కంట్రోల్‌ టవర్‌ నిర్మించుకున్నామని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల స్థూపం, అన్ని హంగులతో తెలంగాణ సచివాలయం వంటి చారిత్రక నిర్మాణాలు దశాబ్ది కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధికి సూచికలని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యవసాయంలో దేశానికే ఆదర్శం..

వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిశానిర్దేశం చేస్తోందని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి కేసీఆర్‌ రైతు బాంధవుడిగా నిలిచాడన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వ్యవసాయ పరమైన అంశాలపై రైతులు చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలను నిర్మించామన్నారు. జిల్లాలో ఆయిల్‌ఫాం సాగు పెరిగిందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పూడిక తీయడంతో నేడు భూగర్భ జలాలు పెరిగాయన్నారు.

సాగునీటి రంగంలో స్వర్ణయుగం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంలో స్వర్ణయుగం తలపిస్తోందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించి దేశానికి అన్నం పెడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పురోగతిలో ఉన్నాయని, ఉదయ సముద్రం పథకం కింద లక్ష ఎకరాలకు నీరందించేందుకు రూ.524 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశామన్నారు. డిండి లిఫ్టు ఇరిగేషన్‌ పథకం ద్వారా 3.61లక్షల ఎకరాలకు నీరందించేందుకు పనులు ప్రారంభించచామన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే అన్నారు. దామరచర్ల వద్ద 5600 ఎకరాల్లో రూ.30 వేల కోట్లతో 4000 మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నామని.. డిసెంబర్‌ 2024 నాటికి మూడు యూనిట్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

ఫ్లోరైడ్‌ పీడ విరగడ

మిషన్‌ భగీరథ ద్వారా సురక్షితమైన నీటిని ఇంటింటికి అందిస్తుండడంతో ఫ్లోరైడ్‌ పీడ విరగడైందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. విదేశాల్లో చదువుకునేందుకు సాయం అందిస్తున్నామన్నారు. మెడికల్‌ కాలేజీతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా మెరుగుపర్చడం జరిగిందన్నారు. సాగర్‌లో బుద్ధవనాన్ని అద్భుతంగా నిర్మిచుకున్నామని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్‌ శాఖ ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నింటినీ ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తున్న జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిలుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్‌, నోముల భగత్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆపూర్వరావు, మున్సిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ మల్లికార్జున రెడ్డి, అదనపు కలెక్టర్లు ఖుష్భూగుప్తా, భాస్కర్‌రావు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఫ తొమ్మిదేళ్ల స్వయం పాలనలో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు

ఫ విద్య, వైద్యం, తాగు, సాగునీరు, విద్యుత్‌ రంగాల్లో అపార అభివృద్ధి

ఫ రాష్ట్రం ఏర్పడిన రోజే స్వయం పాలన ప్రారంభం కావడం చారిత్రాత్మకం

ఫ తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది వేడుకల్లో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నేడు రైతు దినోత్సవం

రామగిరి(నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి 140 క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికల వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్లస్టర్ల పరిధిలో వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తిప్పర్తి మండలంలోని పజ్జూరులో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, అనిశెట్టి దుప్పలపల్లిలో అదనపు కలెక్టర్‌ ఖుష్భూ గుప్తా రైతు వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

1
1/4

2
2/4

సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్న విద్యార్థినులు3
3/4

సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్న విద్యార్థినులు

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement