కందనూలు/తాడూరు: పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తిచేయాలని ఆర్జేడీ సోమిరెడ్డి ఆదేశించారు. మంగళవారం తాడూరు మండలం మేడిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలకు పీఎంశ్రీ పథకం కింద కేటాయించిన నిధుల వినియోగం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు. పాఠశాలలో తరగతి గదులు, బడి తోట, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ప్రహరీ, తాగునీరు తదితర సౌకర్యాలను పరిశీలించారు. హిందీ దివస్ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన శబ్దావళి, చిత్రలేఖనాలను ఆయన పరిశీలించి.. పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ రమేశ్‌కుమార్‌తో కలిసి జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ.. పీఎంశ్రీ పాఠశాలలను ఆదర్శవంతమైన విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అందిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు బడి తోటలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, క్రీడా సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో సెక్టోరియల్ అధికారులు కిరణ్‌కుమార్, నూరుద్దీన్ ఉన్నారు.


