నాగర్‌కర్నూల్: కలెక్టరేట్‌లో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. బుధవారం ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరై ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగే వేడుకలకు అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
పకడ్బందీగా
భూముల రీసర్వే
పెద్దకొత్తపల్లి: భూముల రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. బుధవారం పెద్దకొత్తపల్లి మండలం అదిరాలలో భూముల రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన సర్వే వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల రీసర్వేలో రైతుల పొలాల హద్దులు నిర్ణయించడం ద్వారా భూతగాదాలు లేకుండా ఉంటాయన్నారు. సర్వేకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, డివిజనల్ సర్వేయర్ గిరిధర్, మండల సర్వేయర్ బాబునాయక్, సర్పంచ్ కరుణాకర్‌రెడ్డి ఉన్నారు.
పనిభారం తగ్గించండి
కల్వకుర్తి రూరల్: ఆర్టీసీ ఉద్యోగులపై పెంచిన పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి రాజబాబు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం పెరగడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొందరికి కనీసం సెలవులు కూడా దొరకడం లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సంఘం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిపో అధ్యక్షుడు నాగయ్య జెండా విష్కరించారు. కార్యక్రమంలో రామచంద్రయ్య, పరిపూర్ణం, సర్ధార్ సింగ్, రాజగోపాల్, శ్రీనివాసులు, దేవయ్య పాల్గొన్నారు.
కార్మిక పోరాటాలపై
నిర్బంధం సరికాదు
కందనూలు: కార్మికవర్గ పోరాటాలపై ప్రభుత్వం నిర్బంధాలు, అక్రమ అరెస్టులకు పాల్పడటం సరైంది కాదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అక్రమ అరెస్టులు ఉండవని.. సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పోరాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ తీసేసిందని.. ప్రస్తుత ప్రభుత్వం కనీసం ధర్నా ప్రాంతానికి వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుందని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ నా యకులు రామయ్య, పర్వతాలు పాల్గొన్నారు.


