● ‘నగదు వద్దు.. డిజిటల్ ముద్దు’ అంటూ చెప్పి ఇప్పుడు భారం వేయొద్దు
● యూపీఐ చార్జీల వడ్డనపై
వినియోగదారులు, వ్యాపారుల్లో భిన్నాభిప్రాయాలు
● ఎండీఆర్ అమలుతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి రూ.20 కోట్లకుపైగా ఆదాయం
●
అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం అన్ని రకాల వ్యాపారులపై ప్రభావం చూపనుంది. యూపీఐ లావాదేవీలపై విధించే ఛార్జీలు సగటు వ్యాపారిపై తెలియకుండానే పడే అదనపు ఆర్థిక భారం. ముఖ్యంగా మెడికల్ దుకాణాల్లో తీవ్ర పోటీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది వ్యాపారులపై మరింత ప్రభావం చూపుతుంది. వినియోగదారులపై భారం పడకుండా, ప్రతి నెలా మా లాభాల్లోంచే ఈ ఖర్చును భరించాల్సి రావచ్చు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక భారం ఏ స్థాయిలో ఉంటాయో స్పష్టమవుతుంది.
– దేవరశెట్టి రమేష్, మెడికల్ షాపు నిర్వాహకుడు, మహబూబ్‌నగర్
గద్వాల: డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడిన సామాన్యులపై యూపీఐ చార్జీల భారం పడనుంది. రూ.2 వేల వరకు యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఉండదు. ఆపై జరిగే కొన్ని రకాల చెల్లింపులపై కనిష్టంగా రూ.12 నుంచి గరిష్టంగా రూ.300 వరకు చార్జీలు విధించనున్నారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంపై జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో వివిధ రకాల లావాదేవీలు నెలకు సుమారు రూ.2,500–3,000 కోట్ల మేర జరుగుతున్నట్లు అంచనా. వీటిపై ఎస్‌ఎస్‌టీ, సీఎస్‌టీ తదితర పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే రూ.200–300 కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ అమలుతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి రూ.20 కోట్లకుపైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా. అయితే కొత్త చార్జీలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు సులభతరం కావడంతో నగదు అవసరం తగ్గిందని కొందరు చెబుతుండగా, అదనపు చార్జీల నేపథ్యంలో మళ్లీ నగదు చెల్లింపుల వైపు మళ్లే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.
యూపీఐ పేమెంట్స్‌పై విధించిన నిబంధనలతో వినియోగదారులపై వ్యక్తిగతంగా భారం పడదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు తప్పక తలెత్తుతాయి. వ్యాపారులు వినియోగదారులపైనే భారం మోపుతారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఉండదు. ఇప్పటివరకు సులువుగా ఉన్న డిజిటల్ పేమెంట్స్ రాబోయే రోజుల్లో ఆచితూచి చేయాల్సి వస్తుంది.
– దూద్యానాయక్, కల్వకుర్తి
వినియోగదారులపైనే భారం..
రోజు 20 నుంచి 25 వరకు యూపీఐ పేమెంట్స్ ద్వారా ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. యూపీఐ పేమెంట్ రూ.2వేల వరకు మాత్రమే మినహాయింపుతో వినియోగదారుడు నష్టపోయే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ పేమెంట్ చేసినప్పుడు వినియోగదారుడిపైనే భారం వేస్తారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి.
– సురేశ్‌బాబు, సురభి సూపర్‌మార్కెట్, నాగర్‌కర్నూల్


