మన్ననూర్: కృత్రిమ తేనె (శరణబీస్)తో చెంచులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి లభిస్తుందని సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సలోని చాప్రా అన్నారు. మంగళవారం నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని మల్లాపూర్ పెంటలో హంబుల్ బీ, సెర్ఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శరణబీస్ ప్రాజెక్టును ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాహణ తీరు, ప్రయోజనాలు తదితర అంశాలను చెంచులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా పూర్తి ప్రోత్సాహం, సహకారం అందిస్తామని.. శరణబీస్ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కాగా, పెంటలో ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేసుకునేందుకు అనుమతులు ఇప్పించాలని చెంచులు కోరారు. పెంట సమీపంలో సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయని.. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, ఇతర పనిముట్లు ఇప్పించాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని, గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని పీఓకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీఎం సైదులు, సీసీ రామకృష్ణ పాల్గొన్నారు.


