కందనూలు: జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సూపర్‌వైజర్లు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో దోమకాటు వ్యాధులైన డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, కలుషిత నీరు, ఆహారం ద్వారా టైఫాయిడ్, వాంతులు విరేచనాలు తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నివారణ చర్యల గురించి ప్రజలకు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. హైరిస్క్ గర్భిణులను పర్యవేక్షణ సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ.. సురక్షిత మాతృత్వం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో అంటువ్యాధుల నివేదిక పంపాలని తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ల స్క్రీనింగ్ పరీక్షలు 30 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి నిర్వహించాలని, కాంబినేషన్ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రవికుమార్, ప్రదీప్, ఉప జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి, పీహెచ్‌సీల పర్యవేక్షణ సిబ్బంది పాల్గొన్నారు.


