అచ్చంపేట: మెరుగైన జీవనం కోసం తాము అమ్రాబాద్ టైగర్ రిజర్వు నుంచి స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా.. కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పునరావాస గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం అమ్రాబాద్ మండలం సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, తాటిగుండాలపెంట, వటవర్లపల్లి గ్రామాల ప్రజలు అచ్చంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంరతం డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇటీవల కొందరు చెంచు గిరిజనులను అటవీశాఖ అధికారులు బలవంతంగా అడవుల నుంచి పంపిస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. తమ పిల్లల భవిష్యత్, మెరుగైన జీవన ప్రమాణాల కోసం తాము స్వచ్ఛందంగా పునరావాసాన్ని కోరుకుంటున్నామని వెల్లడించారు. అధికారులు కాని, రాజకీయ నాయకులు కాని తమపై ఎలాంటి ఒత్తిడి, బెదిరింపులు, బలవంతం చేయడం లేదని తెలిపారు. అడవుల మధ్య నివసించడం వల్ల విద్య, వైద్యం, రవాణా, తాగునీరు, అత్యవసర సేవలు వంటి మౌలిక వసతులు పొందడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. వర్షాకాలంలో రహదారులు దెబ్బతినడం, అనారోగ్యానికి గురైతే సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేకపోవడం, పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లి చదవాల్సిన పరిస్థితులు తమ జీవితాలను కష్టతరం చేస్తున్నాయన్నారు. పునరావాసంతో ప్రజలతో పాటు వన్యప్రాణులకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందన్నారు. స్వచ్ఛంద పునరావాసం ప్రజల అభివృద్ధి, ప్రకతి సంరక్షణకు ఒక ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తి మేరకు స్వచ్ఛంద పునరావాస కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలని అటవీశాఖ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఉడతనూరి బుచ్చయ్య, మండ్లి బౌరమ్మ, మడ్లి అంజయ్య, మల్లేష్, చిర్రరాములు తదితరులు పాల్గొన్నారు.


