రాజోళి: ‘దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది ఆర్డీఎస్ కెనాల్ పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఆర్డీఎస్‌లో ఆధునికీకరణ పనులు చేయకపోగా.. దాన్ని ప్రతిపాదనలు పక్కకు పెట్టి మరమ్మతు చేపట్టేందుకు సిద్ధయమ్యారు. ఇందుకోసం 2022లో రూ.11 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది తాత్కాలిక ఉపశమనమైనప్పటికీ.. కెనాల్ మరింత బలహీనపడిపోతుండటంతో ఈ పనులు ఆర్డీఎస్‌కు ప్రయోజనకరంగానే మారాయి. కానీ, చేస్తున్న పనులే ఆలస్యమవుతుండటంతో చివరికి ప్రయోజనం ఉండకుండా పోతుందని రైతులు వాపోతున్నారు.
ఆర్డీఎస్ కెనాల్ 65వ కి.మీ., నుంచి 145 కి.మీ., వరకు ఈ పనులు చేపట్టేలా ప్లానింగ్ చేశారు. అందులో భాగంగా సిల్ట్ రెన్యువల్, బ్యాకింగ్ వర్క్స్, సీసీ వర్క్, కాంక్రీట్ పనులు, జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయాల్సి ఉంది. కాగా చేపట్టిన పనులు వేగంగా జరగకపోగా.. చేస్తున్న సమయం అనుకూలించడం లేదని రైతులు అంటున్నారు. రూ.11 కోట్లకు గాను ఇప్పటికే రూ.7.20 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయి. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు అనుబంధంగా ఉన్న మరో కాంట్రాక్టర్‌తో అదనంగా మరో రూ.3 కోట్ల పనులు చేపట్టగా.. ఇప్పటికి దాదాపు రూ.2 కోట్ల పనులు చేయాల్సి ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. చేసే పనులు కూడా వర్షాకాలంలో, పంటల సాగు సమయంలో చేస్తే ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కెనాల్‌లో నీరు కూడా ఉండదని, పంటలు కూడా సాగులో ఉండవని, ఈ సమయంలో పనులు వేగంగా సాగుతాయని రైతులు చెబుతున్నారు. కేవలం మరమ్మతు పనులకే నాలుగేళ్లుగా కాలం వెల్లదీస్తున్నారని, ఆధునికీకరణ లాంటి పెద్ద పనులు చేయాలంటే ఇంకెన్నేళ్లు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికీ 65 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తుంది. మిగతా పనులు ఎప్పుడు చేపడతారనేది స్పష్టత లేదనే వాదన వినిపిస్తుంది. ఫిబ్రవరి చివరలోనే కెనాల్‌లో నీరు తగ్గుముఖం పట్టగా.. అప్పటి నుంచే పనులు ప్రారంభించి ఉంటే.. జూన్‌లో వర్షాలు కురిసే సమయానికి చాలా వరకు పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉండేదని, అది వదిలేసి ఇప్పుడు పనులు చేయకుండా, మళ్లీ సీజన్ ప్రారంభమయ్యాక పనుల పేరుతో కెనాల్‌లో నీటిని ఆపే చర్యలు మొదలవుతాయని అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి పనులను వేగంగా చేపట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో అందించడంతో పాటు పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తీసుకోవాలని.. అప్పుడే పనుల్లో వేగం పెరుగుతుందని ఆర్డీఎస్ రైతులు అంటున్నారు.
నోటీసులు ఇచ్చాం..
ఆర్డీఎస్ కెనాల్ మరమ్మతు పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. ఇంకా రూ.2 కోట్లకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంది. అయితే పనుల్లో ఆలస్యమవుతుందని సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు చెప్పాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. – శ్రీనివాసులు, ఈఈ, ఆర్డీఎస్
2022లో ఆర్డీఎస్ మరమ్మతుకు రూ.11 కోట్ల కేటాయింపు
నేటి వరకు నత్తనడకనకొనసాగుతున్న పనులు
నాలుగేళ్లు గడిచినా 60 శాతమే పూర్తి..
సీజన్ ప్రారంభానికి ముందే చేపట్టాలంటున్న రైతులు
ఇప్పటికిప్పుడు మొదలుపెడితేనే పూర్తయ్యే అవకాశం


