పకడ్బందీగా జనగణన
● ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు
పాటించాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్
కల్వకుర్తి రూరల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కల్వకుర్తి మండలం తర్నికల్‌లో సోమవారం అరైవ్.. అలైవ్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. ప్రమాదాలను నివారించి.. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమంపై అన్ని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం రోడ్డు భద్రతపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు నిబంధనలపై రూపొందించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామ సర్పంచ్ వరలక్ష్మి పవన్‌కుమార్‌రెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అదే విధంగా ప్రధాన రహదారిపై బ్లాక్ స్పాట్లను కలెక్టర్ పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్టీఓ చిన్నబాలు, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం పాల్గొన్నారు.
కందనూలు: త్వరలో చేపట్టే జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళీకేరి వీసీ ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 460 గ్రామ పంచాయతీలు, 85 మున్సిపల్ వార్డుల్లో జనగణన నిర్వహించేందుకు 1,799 మంది ఎన్యూమరేటర్లు, 263 మంది సూపర్‌వైజర్లును ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ నెల 18 నుంచి మే 5వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీసీలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత పాల్గొన్నారు.


