కందనూలు: ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దేవసహాయం, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్‌తో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల అధికారులనుద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణిలో 102 దరఖాస్తులు వచ్చాయని.. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరం పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
నిర్భయంగా పోలీసు సేవలు పొందాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపించనున్నట్లు ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఆయన సూచించారు.


