నాగర్‌కర్నూల్ రూరల్: సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, పీఎస్ రేట్ కార్మికులకు జీఓ నం.11 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టిజన్ కార్మికుల ఎంప్లాయీస్ యూనియన్ ఐదు రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరాస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి రామయ్య మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులు గత ఎనిమిది సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కరించాలని పోరాడుతున్న స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం యాజమాన్యంతో వెంటనే చర్చలు జరిపి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, ఆంజనేయులు, పర్వతాలు, పసియొద్దీన్, శివ, రాములు లింగం, తిరుపతయ్య, బాలస్వామి పాల్గొన్నారు.


