ఆస్తి పన్నుపై ఊరట | - | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్నుపై ఊరట

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

ఆన్‌లైన్‌లోనూ చెల్లింపులు

5 శాతం రాయితీ ప్రకటించిన మున్సిపల్‌ శాఖ

కల్వకుర్తి టౌన్‌: మున్సిపాలిటీల అభివృద్ధికి ఆస్తిపన్నులే ఎంతగానో దోహదపడతాయి. అలాంటి పన్నులను సకాలంలో వసూలు చేసేందుకు మున్సిపల్‌ శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఆస్తిపన్ను బకాయిల చెల్లింపునకు ముందస్తు చెల్లింపులు చేసేవారికి ఎర్లీ బర్డ్‌ స్కీం ప్రకటించింది. నిర్ణీత సమయంలో ఆస్తిపన్ను వసూలు చేసి మున్సిపాలిటీల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మున్సిపల్‌ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

మున్సిపాలిటీల బలోపేతం

ముందస్తు ఆస్తిపన్ను చెల్లించేందుకు ఉత్సాహంగా ఉన్న యజమానులకు 5 శాతం రాయితీ శుభవార్తగా మారింది. ముందస్తు పన్ను వసూలులో రెవెన్యూ పరంగా మున్సిపాలిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభివృద్ధికి ముందడుగుగా భావిస్తున్నారు. ఏటా ఆస్తిపన్ను వసూలు 100 శాతం లక్ష్యం చేరుకునేందుకు ఈ స్కీం ఎంతగానో ఉపయోగపడుతుంది.

5 శాతం రాయితీ..

జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ మున్సిపాలిటీలలో ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించే యజమానులకు 5 శాతం రాయితీ వర్తిస్తుంది. దీనిపై పెద్దఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రచారం నిర్వహించాలని మున్సిపల్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాయితీ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా పన్నుల మేళాలను మున్సిపల్‌ అధికారులు నిర్వహించనున్నారు. పన్ను చెల్లింపులను మెరుగుపరిచేందుకు నేరుగా కమిషనర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని మున్సిపల్‌ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే గత సంవత్సరాలకు సంబంధించిన పన్ను బకాయలు ఉంటే, వాటిపై ఎలాంటి రాయితీ వర్తించదు. బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించిన తర్వాతే ప్రస్తుత ఏడాది రాయితీ పొందే అవకాశం ఉంటుంది. ఎర్లీ బర్డ్‌ స్కీం కోసం ఆయా మున్సిపాలిటీలలో ప్రత్యేక కౌంటర్లను సైతం అధికారులు ఏర్పాటు చేశారు.

మున్సిపాలిటీ అసెస్‌మెంట్లు డిమాండ్‌

(రూ.కోట్లలో)

కల్వకుర్తి 8,334 3.7

నాగర్‌కర్నూల్‌ 11,020 4.44

కొల్లాపూర్‌ 6,517 1.3

అచ్చంపేట 6,765 3.38

ఈ నెలలో చెల్లిస్తేనే

వర్తించనున్న పథకం

ఆదాయం పెంచాలనే

లక్ష్యంతోనే ఈ నిర్ణయం

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ

చెల్లింపులకు అవకాశం

రిబేట్‌పై ప్రజలకు అవగాహన

కల్పించాలని ఆదేశాలు

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగం మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించింది. ప్రజల సౌకర్యార్థం మున్సిపల్‌ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. మీ– సేవ కేంద్రాల ద్వారా కూడా ఆస్తిపన్ను చెల్లించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement