ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

క్రిటికల్‌ కేర్‌ సెంటర్లతో

అత్యవసర వైద్యసేవలు

ఆధునిక పరికరాలు

అందుబాటులోకి తీసుకువస్తాం

ఖాళీల భర్తీకి భారీ స్థాయిలో నియామకాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

నాగర్‌కర్నూల్‌ క్రైం: రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం అని, ఇందులో భాగంగానే మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర వైద్యసేవలను అందించి ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రిటికల్‌ కేర్‌ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని మెడికల్‌ కళాశాల ఆవరణలో రూ.23.75 కోట్లు వెచ్చించి.. 50 బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ అత్యవసర సేవల విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినా.. హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చినా, విష జ్వరాలు ప్రబలినా ఇకపై హైదరాబాద్‌కు పరుగులు తీయకుండా.. స్థానికంగానే మెరుగైన వైద్యం అందించేందుకు ఈ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు వేగవంతంగా చేస్తున్నామన్నారు. అలాగే వైద్యులు, నర్సుల ఖాళీలను భర్తీ చేయడానికి భారీస్థాయిలో నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు.

వసతుల కల్పనకు కృషి..

వైద్య విద్యార్థులు భవిష్యత్‌లో సమాజానికి నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హాస్టల్‌, లైబ్రరీలు, ల్యాబొరేటరీలను అభివృద్ధి చేస్తున్నామని, ఆధునిక పరికరాలు, మెరుగైన బోధన విధానాలు, క్లినికల్‌ ట్రైనింగ్‌ వంటివి అభివృద్ధి చేస్తున్నామన్నారు. జనరల్‌ ఆస్పత్రిలో అవసరమైన వసతుల కల్పనకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో రూ.2.65 కోట్ల నిధులు అందుబాటులో ఉంచామని, వీటితో అవసరమైన వైద్య పరికరాలు నేరుగా కలెక్టర్‌ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వైద్య కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా కళాశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని, క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం విద్యార్థులు మెడికల్‌ కళాశాల నుంచి జనరల్‌ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కోసం మరికొన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు.

● ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. జనరల్‌ ఆస్పత్రి, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సహకారం ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ, కమిషనర్‌ సృజన, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ రవీందర్‌నాయక్‌, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సునేంద్ర, వైస్‌ చైర్మన్‌ రమేష్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, డీఎంహెచ్‌ఓ రవినాయక్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement