హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

పెద్దకొత్తపల్లి: ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకోలులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసి మాట్లాడారు. ఇచ్చిన హామీల్లో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కుటుంబం కోసం ఇల్లు ఉండాలని, ఇంటి కోసం అప్పు చేయవద్దని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షలతోనే కుటుంబానికి సరిపడా ఇంటి నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మిగులు బడ్జెట్‌ను స్వాహా చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అప్పులకు ప్రస్తుత తమ ప్రభుత్వం ప్రతినెలా రూ.6 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టేది లేకుంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల భవిష్యత్‌ మారేదని, గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందేవన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృథా ఖర్చులను తగ్గించడంతోపాటు ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. అనంతరం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు సత్యం, సర్పంచ్‌ కుర్మయ్య, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఆరోగ్య నాగర్‌కర్నూల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయుష్‌ సేవలు, యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక హెల్త్‌ వీక్‌లో భాగంగా శుక్రవారం జనరల్‌ ఆస్పత్రిలో ప్రపంచ హోమియోపతి– ఆయుష్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ డీఎంహెచ్‌ఓ రవికుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం హోమియోపతి, యోగా, ఆయుర్వేద వంటి సంప్రదాయ వైద్య విధానాలను మరింత ప్రోత్సహిస్తూ అందుబాటులోకి తీసుకువస్తోందన్నారు. హోమియోపతి వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని, సహజ సిద్ధమైన, సురక్షితమైన చికిత్స విధానంగా గుర్తింపు పొందిందని, శరీరంలోని సహజ రోగ నిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందన్నారు. రోగి శారీరక, మానసిక స్థితులను కూడా పరిగణలోకి తీసుకుని చికిత్స అందించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, అలర్జీలు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధ వంటి అనేక సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఆరోగ్య సంరక్షణలో హోమియోపతి ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని, దుష్ప్రభావాలు తక్కువగా ఉండటం, తక్కువ ఖర్చుతో చికిత్స, అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హోమియో సేవలను విస్తరించి ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి అలవాట్లు, మాతాశిశు సంరక్షణ వంటి కీలక అంశాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వెల్‌నెస్‌ సెంటర్లు, ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఆయుష్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ గోపాల్‌నాయక్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషారాణి పాల్గొన్నారు.

సృజనాత్మకతతో

ఆలోచించాలి: వీసీ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త స్టార్టప్‌లను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని ఎంబీఏ, మ్యాథ్స్‌ డిపార్ట్‌మెంట్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఎంబీఏ లాంటి డిపార్ట్‌మెంట్‌లలో చదివిన విద్యార్థులు మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో సులువుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మార్కెటింగ్‌, బ్యాంకింగ్‌, ఇండస్ట్రియల్‌ సెక్టార్‌లలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబులు, కృష్ణయ్య, అర్జున్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

వేరుశనగ క్వింటాల్‌ రూ.7,249

కల్వకుర్తి రూరల్‌: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్‌ గరిష్టంగా రూ.7,249, కనిష్టంగా రూ.5,301, సరాసరిగా రూ.6,575 ధర లభించింది. 236 క్వింటాళ్ల వేరుశనగ మార్కెట్‌ యార్డుకు తీసుకురాగా.. రైతులకు మధ్యాహ్న భోజనం అందించామని మార్కెట్‌ కార్యదర్శి శివరాజ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement