● జిల్లాలోని ఇసుక రీచ్‌ల వద్ద
సీసీ కెమెరాలు ఏర్పాటు
● కలెక్టర్ బదావత్ సంతోష్
కందనూలు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్, ఏఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే జరగాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ బుకింగ్ అనుమతించబడదని స్పష్టం చేశారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై వచ్చిన దరఖాస్తులను పర్యావరణ అనుమతుల ఆధారంగా పరిశీలించి.. తెలంగాణ మినరల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే ఇసుక రవాణా జరిగేలా అనుమతులు ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఇసుక రీచ్‌ల వద్ద అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్‌శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణ, జిల్లా నీటిపారుదలశాఖ అధికారి మురళి, డీపీఓ శ్రీరాములు, భూగర్భజలశాఖ అధికారిణి దివ్య జ్యోతి ఉన్నారు.
జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదు..
జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని.. గృహ అవసరాలకు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి ఆయన జిల్లాలో గ్యాస్ వినియోగంపై సమీక్షించారు. జిల్లాలో వంటగ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డొమెస్టిక్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్ల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.


