నాగర్‌కర్నూల్ క్రైం: హెచ్‌ఐవీ మహమ్మారిని నిర్మూలించేందుకు కృషిచేస్తున్న వైద్యారోగ్యశాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ కోరారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో వైద్యసిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధిగ్రస్తులకు చికిత్స విధానంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఎవరికై నా వ్యాధి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆరోగ్యకేంద్రాల్లో హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్నారు. కాగా, జిల్లా జనరల్ ఆస్పత్రిలోని మైత్రి క్లినిక్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు సబ్ జైలులో ఉన్న ఆరుగురు ఖైదీలకు హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి – సి, సిఫిలిస్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి, ఆర్‌ఎంఓ డా.రవిశంకర్, ప్రోగ్రామ్ అధికారులు డా.కృష్ణమోహన్, డా.ప్రదీప్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.భరత్‌కుమార్ పాల్గొన్నారు.


