వెల్దండ: డిండి – నార్లాపూర్ ప్రాజెక్టులో భాగంగా వెల్దండ మండలం అజిలాపూర్ శివారులో నిర్మిస్తున్న ఇర్విన్ రిజర్వాయర్ ముంపు భూముల్లో గురువారం అటవీశాఖ అధికారులు చేపట్టిన సర్వేను నిర్వాసితులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో 92 మంది రైతులకు చెందిన 186.30 ఎకరాల భూములతో పాటు పలు రకాల చెట్లు ముంపునకు గురవుతున్నాయి. వాటి నష్టాన్ని అంచనా వేసేందుకు అటవీశాఖ అధికారులు సర్వే చేపట్టగా.. భూ నిర్వాసితులు అక్కడికి చేరుకొని తమకు ఎంతమేర నష్టపరిహారం చెల్లిస్తారో స్పష్టం చేసిన తర్వాతే సర్వే చేపట్టాలని అధికారులను అడ్డుకున్నారు. భూ నిర్వాసితులకు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెనుదిగారు. ఈ సందర్భంగా తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతూ నిర్వాసితులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సిద్దగోని రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.


