కొలువుదీరిన డీసీసీ కార్యవర్గాల ప్రమాణ స్వీకారం
మీ బాధ్యత పెరిగింది..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలే కీలకంగా పనిచేశారని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. పార్టీని బలపర్చుకుంటేనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని, పార్టీ నిర్మాణం శాశ్వతంగా ఉంటేనే మళ్లీ ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రభుత్వం లేకున్నా పార్టీ ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. వందేళ్లకు పైగా ప్రజాసేవలో ఉన్న పార్టీని కాపాడుకోవాలని కోరారు. కాంగ్రెస్‌లో పదవులు రావడంతో బాధ్యత మరింత పెరిగిందని గుర్తుచేశారు. ఇలాంటి అవకాశం కోసం ఎందరో ఎదురుచూస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌సావంత్, సీడబ్లూసీ సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్ పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: ఒకప్పుడు వెనుకబాటుకు గురైన పాలమూరు ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రాల్లో డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరును మేటి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికేంద్రీకరించారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
మేటి జిల్లాగా మార్పు..
ఒకప్పుడు వలసల జిల్లాగా పేరొందిన పాలమూరును ప్రస్తుతం హైదరాబాద్‌కు సమీపంలో మేటి జిల్లాగా తమ ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని టీపీసీసీ చీఫ్ చెప్పారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేస్తామన్నారు. కృష్ణానీటిలో వచ్చే వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రణాళిక కొనసాగుతోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలో అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ జోడో యాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరులోనే సింహభాగం పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. ఇక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నాకే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు న్యాయం కోసం కుల సర్వే చేపట్టామన్నారు. దీనివల్ల వెనుకబడిన పాలమూరు జిల్లాకు ఎక్కువగా లబ్ధి చేకూరిందన్నారు. కుల సర్వే లెక్కల ఆధారంగా బీసీలకు 28 శాతం రిజర్వేషన్లు అమలుచేసినప్పటికీ, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా 52 శాతం చైర్మన్ స్థానాలను బీసీలకే కేటాయించామని వివరించారు. పీసీసీ, డీసీసీ పదవుల్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలకే ఇచ్చామన్నారు.
జాతీయ హోదా కోసం పోరాటం..
ఉమ్మడి జిల్లాలో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి ఆయకట్టు రైతులకు సాగునీటితోపాటు హైదరాబాద్‌కు తాగునీరు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే ప్రాజెక్ట్ త్వరగా పూర్తవుతుందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. విభజన హామీల్లో జాతీయ హోదాతోపాటు చాలావరకు హామీలను కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు.
ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
ఒకప్పుడు వెనుకబడిన పాలమూరు ఇప్పుడు దూసుకెళ్తోంది
సీఎం రేవంత్‌రెడ్డి సొంత గడ్డఅభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
‘పాలమూరు’ ప్రాజెక్ట్ జాతీయ హోదా కోసం పోరాటం చేస్తామని హామీ


