కందనూలు: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం చేసేవారి పారితోషికం పెంచాలని, గతేడాది బకాయిలు వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లాకేంద్రంలోని మూల్యాంకణ కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విరామ సమయంలో నిరసన తెలిపి.. అనంతరం డీఈఓ రమేష్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐక్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఏడేళ్ల నుంచి పదో తరగతి మూల్యాంకనం పారితోషికం పెంచలేదని ఆరోపించారు. దీంతోపాటు సమగ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు.
వనపర్తి వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు
వనపర్తి: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పార్ట్–1లో రాష్ట్రంలోనే ఉత్తమ ఉత్తీర్ణత శాతం సాధించారు. ఈ సందర్భంగా కళాశాలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలు తమ తమ విభాగాల్లో సాధించిన ఫలితాలకు గుర్తింపుగా ప్రిన్సిపాళ్లకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక వైద్య కళాశాల తరఫున ప్రిన్సిపాల్ డా. పి.మల్లికార్జున్, సూపరింటెండెంట్ డా.అరుణ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో కలెక్టర్ ఆదర్శ్ సురభి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులు, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందాన్ని అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
‘చలో వరంగల్’కు
తరలిరండి
రాజోళి: రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ కమిటీ పిలుపుమేరకు బుధవారం చేపట్టిన చలో వరంగల్ కార్యక్రమానికి తరలిరావాలని జోగుళాంబ గద్వాల జిల్లా జేఏసీ చైర్మన్ శివప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి దశల వారిగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆర్టిజన్ కార్మికులు చేపట్టే నిరవదిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్హతను బట్టి ఉద్యోగాలు కల్పించాలని, స్పాట్ బిల్డర్లకు జీఓ 11 ప్రకారం వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సుధాకర్, రాముడు, అనంతరెడ్డి, సతీష్, లోకేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాలభవన్‌లో
వేసవి శిక్షణ శిబిరం
గద్వాల న్యూటౌన్: జిల్లాకేంద్రంలోని బాలభవన్‌లో ఈ నెల 24 నుంచి జూన్ 2 వరకు సాంస్కృతిక వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి, శాసీ్త్రయ నృత్యం, జానపద నృత్యం, గాత్ర సంగీతం, డ్రాయింగ్, వాయిద్య సంగీతం, కుట్లు, అల్లికలు తదితర అంశాల్లో శిక్షణ ఉంటుందన్నారు. 5 నుంచి 16 ఏళ్ల బాల, బాలికలు అర్హులన్నారు. సాధారణ ఫీజు రూ.50 కాగా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.20 మాత్రమే ఫీజు ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. శిబిరంలో చేరే విద్యార్థులు ఆధార్, విద్యార్హత ధ్రువపత్రం, ఎస్సీ, ఎస్టీ వారు కుల ధ్రువపత్రాల జిరాక్స్‌తోపాటు పాస్‌పోర్టు సైజు ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 96668 53335, 94409 81190లను సంప్రదించాలని సూచించారు.


