సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగిరం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగిరం చేయాలి

Apr 8 2026 7:56 AM | Updated on Apr 8 2026 7:56 AM

కందనూలు: జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి, డిండి, కేఎల్‌ఐ, అచ్చంపేట, మార్కండేయ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వంటి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రాజెక్టులు జిల్లాలో సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఎక్కడైనా ఆలస్యం జరుగుతున్నట్లయితే వెంటనే పరిష్కార చర్యలు చేపట్టి, పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలని, ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో ప్రస్తుత నీటి నిల్వల పరిస్థితిపై ఆరాతీయగా.. రాబోయే మూడు నెలలపాటు జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. విద్యుత్‌ వినియోగం, పంపింగ్‌ వ్యవస్థలు, సాగునీటి సరఫరా వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోస్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, అధికారులు, మిల్లర్లు, కాంట్రాక్టర్లతో రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రబీ సీజన్‌లో 1.43 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని, సుమారు 4.53 లక్షల మె.ట., దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందుకు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం క్వింటాల్‌ గ్రేడ్‌– ఏ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించిందని, సన్నాలు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందిస్తుందన్నారు. జిల్లాలో రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దివ్యాంగుల అభ్యున్నతికి ప్రాధాన్యం

దివ్యాంగుల అభ్యున్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎంపీ మల్లురవి అన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డిలో కలిసి లబ్ధిదారులకు ట్రైసైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తన నిధులు రూ.12.31 లక్షలతో 9 మంది దివ్యాంగులకు ఎలక్ట్రికల్‌ ట్రైసైకిళ్లను అందజేశామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. సమాజంలోని ప్రతివర్గం అభివృద్ధి చెందాలంటే దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement