కందనూలు: క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీని స్థాపించి సోమవారానికి 47 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారని కొనియాడారు. బీజేపీ జెండా పేద ప్రజల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో ఎంతో మంది పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తుండటంతో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీని మరింత పటిష్టపరిచేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.


