డిగ్రీలోనూ ఎఫ్‌ఆర్‌ఎస్‌! | - | Sakshi
Sakshi News home page

డిగ్రీలోనూ ఎఫ్‌ఆర్‌ఎస్‌!

Apr 6 2026 7:24 AM | Updated on Apr 6 2026 7:24 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కీలక మార్పు

విద్యార్థులతో పాటు ఆధ్యాపకులు, సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు

ప్రత్యేక యాప్‌ రూపొందించిన ఉన్నత విద్యామండలి

కళాశాల ప్రాంగణంలో ఉంటేనే నమోదు

75శాతం హాజరు

ఉంటేనే స్కాలర్‌షిప్‌..

జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా.. 112 మంది అధ్యాపకులు, 57 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2,316 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొన్నేళ్లుగా కళాశాల తరగతి గదిలోనే మ్యానువల్‌గా విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు కళాశాలకు డుమ్మా కొట్టినా.. వారికి 75శాతం హాజరు ఉండేలా చూసేవారు. ఇప్పుడు ఫెషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ రావడంతో విద్యార్థులు తప్పనిసరిగా కళాశాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సెమిస్టర్‌లో, రెండవ సంవత్సరం విద్యార్థులు నాలుగో సెమిస్టర్‌లో ఉండగా.. వీరికి యాప్‌ను ఉపయోగించి హాజరు నమోదు చేస్తున్నారు. తద్వారా విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చూడటంతో పాటు 75శాతం కంటే తక్కువ హాజరు ఉన్న విద్యార్థులకు ఉపకార వేతనాలు నిలిపివేయనున్నారు.

కందనూలు/అచ్చంపేట: ఉన్నత విద్యా వ్యవస్థలో కీలక మార్పు చోటు చేసుకుంది. డిగ్రీ కళాశాలలను గాడిలో పెట్టేందుకు.. అర్హులైన విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌షిప్‌ అందించేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్‌ స్థానంలో ముఖ గుర్తింపు హాజరు (ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌) విధానాన్ని తీసుకొచ్చారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలు మినహా అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి నూతన విధానంలో హాజరు నమోదును తప్పనిసరి చేశారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చారు. దీంతో విద్యార్థులు తరగతులకు డుమ్మా కొట్టే అవకాశం లేకుండా పోయింది.

ప్రైవేటు కళాశాలల మినహాయింపుపై విమర్శలు..

ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో చదివే కొందరు విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా.. నేరుగా పరీక్షలు రాస్తున్నారనే విమర్శలున్నాయి. అలాగే కళాశాలల్లో అధ్యాపకులను నియమించకుండా, కేవలం ఉపకార వేతనాల కోసమే కళాశాలలు నడుపుతున్నారనే అరోపణలు లేకపోలేదు. కొత్త విధానంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గి, ప్రైవేటులో పెరిగే అవకాశం ఉందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థులకు ఉపయోగం..

ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంతో విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చి సబ్జెక్టు నేర్చుకోవడంతో పాటు ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉంది. రెగ్యులర్‌గా క్లాసులు వినడం ద్వారా బ్యాక్‌లాగ్స్‌ లేకుండా ఉంటుంది. ఈ విధానం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం.

– మదన్మోహన్‌, ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, నాగర్‌కర్నూల్‌

Advertisement
 
Advertisement
Advertisement