పక్కాగా ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
కందనూలు: జిల్లాలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 2న జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డుసభలు విధిగా నిర్వహించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామసభలకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల వివరాలను గ్రామ, వార్డుల వారీగా సభలలో వెల్లడించాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉదయం 8 గంటలకు గ్రామసభలు ప్రారంభం కావాలని, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యా, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీపీఓ శ్రీరాములు, డీఆర్‌డీఓ చిన్న ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.


