చారకొండ: భక్తుల రామనామస్మరణ.. సన్నాయి వాయిద్యాలు.. పండితుల వేద మంత్రోచ్ఛరణాల మధ్య.. పచ్చని పందిళ్లలో ముత్యాల తలంబ్రాలతో జగధబిరాముడు, సీతాదేవిల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంతో శుక్రవారం సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని జరిపించిన జానకి రాముల కల్యాణ వైభోగాన్ని భక్తజనం కనులారా వీక్షించి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. ఉదయం 10 గంటలకు సామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకురాగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. పండితులు మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని జరిపించారు. రాముడి దోసిట తలంబ్రాలు నిలువు రాసులుగా.. జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలైన వేళ సిర్సనగండ్ల క్షేత్రం భక్తిపారవశ్యంతో ఉప్పొంగింది. అలాగే ముగ్గురు ట్రాన్స్‌జెండర్ల జంటలు కల్యాణ వేడుక మండపంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు
కల్యాణం అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో మంత్రి, ఎమ్మెల్యేలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి మరో రూ.కోటి నిధులు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి సిర్సనగండ్ల క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, టాస్క్ సీఓఓ సుకింరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, తహసీల్దార్ ఉమ తదితరులు పాల్గొన్నారు.
● కల్వకుర్తి డీఎప్పీ వెంకట్‌రెడ్డి, సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ వీరబాబు పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. రాంపూర్‌కు చెందిన చిలుకాని బాల్‌రెడ్డి– వెంకటమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. కల్యాణ మహోత్సవానికి సుమారు 30 వేల మంది భక్తులు హాజరయ్యారని దేవస్థాన చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ ఆంజనేయులు తెలిపారు.
కనులపండువగా సీతారాముల కల్యాణం
సిర్సనగండ్లలో ఉప్పొంగిన భక్తిపారవశ్యం
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు
హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు


