శ్రీరామనవమి పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణ వేడుక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వం తరుఫున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. వేడుకలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవి పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వేడుకకు తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అధ్వర్యంలో చలువ పందిళ్లు, అవసరం అయిన చోట టెంట్లు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు. కల్యాణం మండపం ఎదురుగా సుమారు 10 వేల మంది కూర్చునేలా, కల్యాణ మండపం చుట్టూ 20 వేల మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్‌కు గట్టపై చదును చేశారు. వృద్ధులకు, మెట్ల నుంచి ఎక్కలేని వారి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గుట్టపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చైర్మన్ డేరం రామశర్మ చెప్పారు.


