పైసల పంచాయితీ! | - | Sakshi
Sakshi News home page

పైసల పంచాయితీ!

Mar 17 2026 8:21 AM | Updated on Mar 17 2026 8:21 AM

రెండు విడతల్లో జీపీలకు రూ.36.58 కోట్ల నిధులు జమ

మూడో విడత రావాల్సి ఉంది..

మూడో విడతలోనూ రూ.35 కోట్లు విడుదల?

గతంలో తాము ఖర్చు చేసిన డబ్బులు

ఇవ్వాలంటున్న కార్యదర్శలు

నిర్వహణకే సరిపోవని మొండికేస్తున్న కొందరు సర్పంచ్‌లు

అచ్చంపేట: పల్లెలకు పాలకవర్గాలు లేని సమయంలో పంచాయతీ కార్యదర్శలే అంతా తామై వ్యవహరించారు. చెత్త సేకరణ వాహనాలకు డీజిల్‌ మొదలుకొని.. వీధిలైట్లు నిర్వహణ ఖర్చులు భరించారు. అయితే పాలకవర్గాలు కొలువుదీరిన అనంతరం ఇప్పటి వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా జమయ్యాయి. గతంలో ఖర్చు చేసిన డబ్బులు కొందరు సర్పంచ్‌లు కొంత మేర కార్యదర్శులకు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో వారి నడుమ అంతర్గతంగా పంచాయితీ మొదలైంది.

22 నెలల పాటు..

జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2024 ఫిబ్రవరిలో సర్పంచ్‌ల పదవీకాలం ముగియగా.. 2025 డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించారు. సుమారు 22 నెలల పాటు గ్రామాలకు పాలకవర్గాలు కరువయ్యారు. ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించి చేతులు దులుపుకోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్లుగా సమావేశాలు, నిర్వహణ ఖర్చులు కార్యదర్శలే భరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పారిశుద్ధ్యం, వీధిదీపాలు, నీటి సరఫరా, రోడ్లు, డ్రెయినేజీ, ఆరోగ్యం, విద్య, వ్యవసాయంతోపాటు 29 అంశాలకు సంబంధించిన పనులకు చిన్న గ్రామాలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా పరిశ్రమలున్న గ్రామాల్లో ప్రతినెలా పన్నులు రాగా.. మిగతా చోట్ల కార్యదర్శలు అప్పులు చేసి రెండేళ్లపాటు నెట్టుకొట్చారు.

రెండేళ్లు.. రూ.10 కోట్లు

రెండేళ్లలో జిలావ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శలు సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాత కేంద్రం రెండు విడతలుగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి రాష్ట్రానికి రూ.640 కోట్లు విడుదల చేయగా జిల్లాకు రూ.రూ.36.58 కోట్లకుపైగా పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా కేంద్రం మూడు రోజుల క్రితం 2024– 25 ఆర్థిక సంవత్సకానికి సంబంధించిన మొత్తం బకాయిల్లో రాష్ట్రానికి మరో రూ.640 కోట్లు విడుదల చేయగా.. పంచాయతీలకు సుమారు రూ.30– 35 కోట్ల నిధులు జమ కానున్నాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి సుమారు రూ.1,255 కోట్లు ఇంకా రావాల్సి ఉంది. అయితే గతంలో తాము పెట్టిన డబ్బులు ఇవ్వాలని కార్యదర్శలు సర్పంచ్‌లను అడుగుతున్నారు. దీంతో కొందరు సర్పంచ్‌లు కొంత మేర ఇస్తుండగా, మరికొందరు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారుల మాటలు నమ్మి బయట అప్పు చేసి జీపీల నిర్వహణ నెట్టుకొస్తే.. ఇప్పుడు కొందరు సర్పంచ్‌లు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కార్యదర్శలు వాపోతున్నారు. అధికారులు జోక్యం చేసుకొని తాము ఖర్చు చేసిన డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. అలాగే కొందరు పాత సర్పంచ్‌లు సైతం తాము ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు.

15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే రెండు విడతలుగా ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి. అవసరాలను బట్టి వినియోగించుకుంటున్నారు. మూ డో విడత నిధులు కూడా వచ్చాయి. జీపీల్లో జమ కావాల్సి ఉంది. పాత బకాయిలు చెల్లించడంతోపాటు ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు.

– శ్రీరాములు, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement