నాగర్‌కర్నూల్ రూరల్: దేశంలో నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి దేశ ప్రజలను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ అన్నారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు జిల్లా కార్యాలయం నుంచి ఖాళీ సిలిండర్ కుండతో ప్రదర్శనగా అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకుని అక్కడ గ్యాస్ కొరతను నిరసిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్‌పై అమెరికా– ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో పరిస్థితులన్నీ తలకిందులుగా మారి దేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడితే తాను విశ్వనాయకుడిని అని చెప్పుకొంటారు కానీ, మన పక్క దేశాల్లో యుద్ధం ద్వారా ఇక్కడ గ్యాస్ డీజిల్, పెట్రోల్ లాంటి వస్తువుల కొరత ఏర్పడుతుందని కనీసం ముందుచూపు లేకపోవడం విచారించదగ్గ విషయమన్నారు. వీలైనంత త్వరగా వంట గ్యాస్ అందుబాటులోకి తీసుకురాకపోతే సీపీఐ ఆధ్వర్యంలో గ్యాస్ గోదాంలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌జీ, చంద్రమౌలి, కృష్ణాజీ, లక్ష్మీపతి, ఖాజ, వెంకటయ్య, రవీందర్, రామస్వామి, బాలపీరు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


