జూరాల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం
స్థల మార్పిడి కారణంగా..
వాస్తవానికి చాలాకాలంగా జూరాల డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్యాంకు సమీపంలో అదనంగా బ్రిడ్జి నిర్మించాలని అధికారులు రూ.వంద కోట్లతో అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే గతేడాది వానాకాలంలో జూరాల గేట్ల రోపులు తెగిపోయి ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూరాలను సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం రూ.వంద కోట్లతో నూతనంగా మరో బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకు గతంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు నివేదించిన స్థలంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మండలం జూ రాల మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పనులు సైతం మొదలు కాగా.. తాజాగా వివాదం చెలరేగింది.
గద్వాల: కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సేఫ్టీని కాపాడాలి.. ఈ మేరకు డ్యాంకు సమీపంలో మరో బ్రిడ్జి నిర్మించాలన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో జూరాల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం నెలకొంది. ఇదే అంశంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో సైతం చర్చ జరగడం.. దీనిపై సమగ్ర వివరాలను ఆ శాఖ అధికారులు మంత్రికి నేరుగా వివరించడం.. ఎంపీ డీకే అరుణ డ్యాం సేఫ్టీని కాపాడాలని సమీక్షలో గట్టిగా కోరడం వంటి పరిణామాలతో సమగ్ర పరిశీలనకు ఆ శాఖ కార్యదర్శి త్వరలోనే జూరాలకు రానున్నారు. దీంతో ప్రస్తుతం గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మధ్యలో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి భవితవ్యం గందరగోళంగా మారింది. ఇదే క్రమంలో ఈ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులు నిరభ్యంతర ధ్రువపత్రం ఇవ్వడానికి మల్లగుల్లాలు పడుతుండటం పెద్దఎత్తున చర్చకు దారితీసింది.
భద్రతే.. ప్రధానం
2021–డ్యాం సేఫ్టీ చట్టం ప్రకారం ఎక్కడైనా పాజెక్టుకు సంబంధించి డ్యాం భద్రతే ప్రధానం. అయితే జూరాల డ్యాం సేఫ్టీకి సంబంధించిన బ్రిడ్జి సమీపంలో కాకుండా డ్యాంకు దూరంగా నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే, టెండర్లు పూర్తయ్యి సివిల్ పనులు సైతం మొదలయ్యాయి. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం డ్యాం సేఫ్టీ చట్టానికి విరుద్ధంగా ఉంది. ఈ చట్టం ప్రకారం డ్యాం సేఫ్టీ పర్యవేక్షణ బాధ్యత ఇరిగేషన్ శాఖదే. వరద వచ్చే ముందు, వరద వచ్చిన తర్వాత డ్యాం భద్రతపై సమగ్ర నివేదిక ఇరిగేషన్ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని కారణంగానే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్‌ఓసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) ఇవ్వడానికి తర్జనభర్జన పడుతున్నారు.
అదనంగా మరొకటి..
‘ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మండలం జూరాల మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి తాము అభ్యంతరం చెప్పడం లేదు. కానీ, జూరాల డ్యాం సేఫ్టీకి అవసరమైన అదనంగా బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడితే భవిష్యత్‌లో డ్యాంకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అదేవిధంగా ప్రస్తుతం గత 40 ఏళ్లుగా డ్యాంపై అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో డ్యాం భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని జూరాల డ్యాంకు సమీపంలో అదనంగా మరో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం అంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.’
డ్యాం స్టేఫీ ప్రధానమంటున్న
ఇరిగేషన్ అధికారులు
ఎన్‌ఓసీ ఇచ్చేందుకు మల్లగుల్లాలు
మూడు, నాలుగు రోజుల్లో రానున్న ఆ శాఖ కార్యదర్శి
పైపెచ్చు ఆర్‌అండ్‌బీ నిర్మించే బ్రిడ్జిపై అభ్యంతరం లేదని స్పష్టీకరణ
ప్రభుత్వ నిర్ణయమే..
జూరాల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం. అయితే జూరాల డ్యాం సేఫ్టీకి సంబంధించి బ్రిడ్జి నిర్మాణం ఇతర అంశాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మా పరిధిలో ఉన్న మేరకు డ్యాం సేఫ్టీకి సంబంధించి పూర్తి వివరాలతో ఇది వరకే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం.
– రహీముద్దీన్, ఎస్‌ఈ, జూరాల
మంత్రి సమీక్షలో చర్చ..
ఇటీవల ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపుపై ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లింది. అయితే ఎంపీ డీకే అరుణ జూరాల ప్రాజెక్టు సేఫ్టీకి చర్యలు తీసుకోవాలని సమీక్షలో గట్టిగా కోరారు. ఇదే క్రమంలో ఇరిగేషన్ అధికారులు డ్యాం సేఫ్టీని మంత్రికి వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతో సమగ్ర వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ కార్యదర్శిని ఆదేశించగా.. ఆయన మూడు, నాలుగు రోజుల్లో జూరాలను సందర్శించనున్నట్లు తెలిసింది.


