కందనూలు: ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఎస్సీలకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే వివిధ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి గాను ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోళ్లకు రాయితీలు అందించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 21 నుంచి 50 ఏళ్ల వయసు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షల వార్షిక ఆదాయం మినహాయింపు ఉంటుందని.. అర్హత కలిగిన వారు ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్‌బుక్‌లతో tgobmms.cgg.gov. in వెబ్‌సైట్‌లో ఈ నెల 17 నుంచి 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేటి నుంచి ఒంటిపూట బడులు
కందనూలు: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఒంటిపూట బడు లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉద యం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసిన పాఠశాలలను మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నప్పటికీ మధ్యాహ్న భోజనం యథావిధిగా కొనసాగనుంది. తరగతులు పూర్తయిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని అధికారులు సూచించారు.
పెట్రోల్ కొరత
కొల్లాపూర్: పట్టణంలో పెట్రోల్ కొరత ఏర్పడింది. స్థానికంగా మూడు పెట్రోల్ బంకులు ఉండగా.. రెండు బంకుల్లో శనివారం రాత్రి నుంచే నో స్టాక్ బోర్డులు పెట్టారు. భార త్ పెట్రోల్ బంకులో మాత్రమే పెట్రోల్ పోస్తుండటంతో ఆ బంకు వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. రెండు, మూడు రోజులుగా పెట్రో ల్ ట్యాంకర్లు రావడం లేదని.. అందుకే నో స్టాక్ బోర్డు ఏర్పాటుచేసినట్లు బంకుల నిర్వాహకులు తెలిపారు.
హామీలన్నీ నెరవేరుస్తాం
వీపనగండ్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని కల్వరాలలో సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మాట్లాడారు. ఉపాధిహామీ నిధులు రూ.16.50 లక్షలతో గ్రామంలో సీసీ రహదారి పనులు చేపడుతున్నామని.. మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కార్య క్రమంలో సర్పంచ్ బండారి రాములు, ఉపసర్పంచ్ తడకల రంగమ్మ పాల్గొన్నారు.
మొబైల్ వాహనాలతో న్యాయ సేవలు
పాలమూరు: తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించడానికి రెండు మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్లు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రారంభించినట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ఒక ప్రటకనలో తెలిపారు. ఈ మొబైల్ వాహనాలు రొటేషన్ పద్ధతిలో జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ లీగల్ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ ప్రచార కార్యక్రమాలు, జైలు సందర్శన చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు చట్టాలపై అవగహన కల్పించడం, బాధితులకు న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయ సేవలను దగ్గర చేయాలనే లక్ష్యంతో ఈ మొబైల్ వాహనాలు ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశమన్నారు. టోల్‌ఫ్రీ నం.15100 ద్వారా న్యాయ సలహాలు పొందవచ్చన్నారు. ఈ మొబైల్ వాహనాల్లో మొదటి క్యాబిన్‌లో కంప్యూటర్లు, ఎల్‌ఈడీ టీవీ, వెబ్ కెమెరాలు, హైస్పీడ్ ఇంటర్‌నెట్, సీసీటీవీ, యూపీఎస్, రెండో క్యాబిన్‌లో జ్యుడీషియల్ అధికారులు, ప్యానెల్ న్యాయవాదులు, పీఎల్‌ఓలు, ఇతర సిబ్బంది ఉంటారని తెలిపారు.


