పకడ్బందీగా జనగణన : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా జనగణన : కలెక్టర్‌

Mar 16 2026 8:47 AM | Updated on Mar 16 2026 8:47 AM

కందనూలు: జిల్లాలో జనగణన పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అధికారులను ఆదేశించారు. జనగణన–2027 ప్రక్రియలో భాగస్వాములయ్యే అధికారులకు ఆదివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొదటి విడత జిల్లాస్థాయి శిక్షణ తరగతులను కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. రెండు దశల్లో చేపట్టే జనగణన నమోదుకు తొలిసారిగా సాంకేతికత వినియోగిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో నివాసగృహాలతో పాటు అన్ని రకాల కట్టడాలు, కుటుంబ వివరాలను సేకరించడం జరుగుతుందని.. రెండో విడతలో వ్యక్తిగత వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. దేశంలోనే తొలిసారి పూర్తిగా డిజిటల్‌ విధానం ద్వారా జనగణన జరపాల్సి ఉంటుందన్నారు. జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వాస్తవ వివరాలు వెల్లడించాలని కలెక్టర్‌ సూచించారు. ఏ ఒక్కరి వివరాలు ఎక్కడ కూడా బయటికి వెల్లడి కావన్నారు. ఈసారి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఎంతో ముఖ్యమని.. అధికారులు, ఎన్యుమరేటర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. చార్జ్‌ ఆఫీసర్లు రోజూ జనగణన ప్రక్రియపై సమీక్షించాలని.. తాము కూడా క్షేత్రస్థాయి రోజువారీగా పర్యవేక్షణ చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో నిర్దేశిత గడువులోగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను పూర్తిచేసేలా సన్నద్ధం చేయాలన్నారు. మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా గణనలో ఇంటి నిర్మాణం, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్‌, స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌, సైకిల్‌, కారు వంటి సౌకర్యాలపై మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సేకరిస్తారని కలెక్టర్‌ తెలిపారు. కాగా, ఈ నెల 17వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే శిక్షణ తరగతుల్లో జనగణనపై అధికారులకు మాస్టర్‌ ట్రైనర్లు బి.లాజర్‌, శివరామకృష్ణ, రాజేశ్వర్‌ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. మొదటి రోజు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వారు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, జెడ్పీ సీఈఓ దేవ సహాయం, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement