జిల్లాలో భూముల రీసర్వేకు శ్రీకారం
● పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు గ్రామాలు ఎంపిక
● అత్యాధునిక సాంకేతికత జీఎన్‌ఎస్‌ఎస్ రోవర్ విధానంలో భూముల సర్వే
● గ్రామసభల నిర్వహణలో రెవెన్యూశాఖ నిమగ్నం
చిరిగిపోతున్న రికార్డులు..
రెవెన్యూ రికార్డులు చాలా వరకు శిథిలావస్థకు చేరి చిరిగిపోతున్నాయి. వందేళ్ల క్రితం నాటి రికార్డులు కావడంతో వాటిని పట్టుకోవడానికి కూడా వీలు లేనంతగా తయారయ్యాయి. కొన్ని గ్రామాలకు అసలు గ్రామ నక్షలు లేవు. దీంతో భూ వివాదాలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామాల వారీగా భూముల రీసర్వే చేయడం ద్వారా ఆయా సమస్యలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్వే ద్వారా డిజిటలైజ్ విలేజ్ మ్యాప్‌లు, కొత్త టీపన్లు, శేత్వార్‌లను రూపొందిస్తారు.
సబ్ డివిజన్లు సైతం..
ఏదైనా ఒక సర్వే నంబర్‌లో భూమికి ఇప్పటి వరకు ఒకే రికార్డు అందుబాటులో ఉంది. ఆయా సర్వే నంబర్‌లో కొంత భాగం ఇతరులకు క్రయవిక్రమాలు జరుగుతుంటాయి. కానీ రికార్డుల్లో మాత్రం సర్వే నంబర్ మొత్తం ఒకే మ్యాప్‌గా ఉంటుంది. చాలా వరకు పెద్ద సర్వే నంబర్లలో సబ్ డివిజన్‌లు జరగలేదు. అలాగే పట్టాదారుకు సంబంధించి ఇద్దరు, ముగ్గురు వారసులు ఉండి.. పంచుకున్న భూమికి సంబంధించి ప్రత్యేకంగా మ్యాప్‌లను తయారు చేస్తారు.
అచ్చంపేట: భూముల రీసర్వేకు రెవెన్యూశాఖ శ్రీకారం చుట్టింది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి, తిమ్మాజిపేట మండలం మరికల్, బిజినేపల్లి మండలం ఖానాపూర్, లింగాల మండలం అంబటిపల్లి గ్రామాల్లో భూముల రీసర్వే చేపడుతున్నారు. ఇందుకోసం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌శాఖ ఉద్యోగులతో పాటు, కొందరు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించారు. ఆయా పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి.. రీసర్వేతో ఉపయోగాలను పట్టాదారులకు వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన డీజీపీఎస్ (డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) విధానం కంటే ఇంకా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ జీఎన్‌ఎస్‌ఎస్ రోవర్ విధానంలో భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు.


