ఆన్‌లైన్‌లోనే ఇసుక అనుమతులు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లోనే ఇసుక అనుమతులు

Mar 11 2026 8:28 AM | Updated on Mar 11 2026 8:28 AM

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి

కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

కందనూలు: జిల్లాలో ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుక కోసం ఆన్‌లైన్‌లోనే అనుమతులు పొందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రెవెన్యూ, మైనింగ్‌శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. జీపీఎస్‌ కలిగి మైనింగ్‌శాఖ వద్ద రిజిస్టర్‌ అయిన వాహనాల ద్వారానే ఇసుక రవాణాకు అనుమతించాలని ఆదేశించారు. జిల్లాలోని 18 ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి.. పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లోడింగ్‌ చేయాలని సూచించారు. ఇసుకను అక్రమంగా తరలించే వాహనాలకు రూ. 20వేల వరకు జరిమానా విధించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లా మైనింగ్‌ అధికారి వెంకటరమణ, కలెక్టరేట్‌ తహసీల్దార్‌ రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

రేపు ప్రజాప్రతినిధులకు శిక్షణ

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న సర్పంచులు, మున్సిపల్‌ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సంతోష్‌ తెలిపారు. ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం విధి విధానాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్‌ రామకృష్ణారావు వీసీ ద్వారా జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి ఫంక్షన్‌హాల్‌లో 12న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు అందరికీ ఆహ్వానం పంపించినట్లు వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌, అమరేందర్‌, జెడ్పీ సిఈఓ దేవసహాయం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement