కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించగా.. 6,059 మందికి గాను 5,863 మంది హాజరయ్యారు. జనరల్‌లో 4,659 మందికి గాను 4,525 మంది, ఒకేషనల్ విభాగంలో 1,400 మందికి గాను 1,338 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్‌లో 134 మంది, ఒకేషనల్ విభాగంలో 62 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
ఉద్యోగుల భద్రతే లక్ష్యం
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉద్యోగుల భద్రతే జెన్‌కో లక్ష్యమని సీఈ కేవీవీ సత్యనారాయణ అన్నారు. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో నిర్వహిస్తున్న జాతీయ భద్రతా వారోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఇంజినీర్లు, ఆర్టిజన్లు, ఇతర ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశంలో సీఈ మాట్లాడారు. కేంద్రంలోని సున్నిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే ఇంజినీర్లు, ఉద్యోగులు సేఫ్టీ దుస్తులు ధరించడంతో పాటు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి సమయంలో ప్రమాదాలకు గురికాకుండా ముందుజాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఈలు ఆదినారాయణ, రవీంద్రకుమార్, డీఈ శ్రీకుమార్‌గౌడ్, ఏడీఈ రాము, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
తెగుళ్ల నివారణతో అధిక దిగుబడులు
అమ్రాబాద్: పంటల్లో తెగుళ్ల నివారణతో అధిక దిగుబడులు సాధించవచ్చని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సత్తయ్య అన్నారు. మండలంలోని కల్ములోనిపల్లి, జంగంరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తల బృందం పర్యటించి ఆముదం, వేరుశనగ, కంది తదితర పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా పంటల సాగులో పాటించాల్సిన మెళకువలు, తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సదయ్య, సిద్దప్ప, ఈశ్వర్‌రెడ్డి, మాధురి పాల్గొన్నారు.


