బల్మూర్/మన్ననూర్: చెంచుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికా రి డా.రవికుమార్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మన్ననూర్, వటువర్లపల్లి పీహెచ్‌సీలతో పాటు బల్మూర్ మండలం చెంచుగూడెంలో వైద్యశిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, డెంటల్, ఐ, గైనకాలజీ, చిన్నపిల్లలకు సంబంధించిన వైద్యులు చెంచులకు సేవలు అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. చెంచులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే సమయంలో 102 వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, చెంచుగూడెంలో 105 మందికి వైద్యపరీక్షలు, మరో 46 మందికి క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.తారాసింగ్, ఫార్మసీ అధికారి శ్రీనివాసులు, డీపీఎంఓ మధుమోహన్, డిప్యూటీ మలేరియా అధికారి బిక్కులాల్, వైద్యులు సురేశ్‌బాబు, సుధాకర్, అభిలాష్, సూపర్‌వైజర్ వెంకటమ్మ, ఫార్మసిస్టు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


