పాన్‌గల్: ఉపాధి పనుల్లో ఆన్‌లైన్ మస్టర్ విధానాన్ని తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జబ్బార్ కోరారు. స్థానిక సమస్యల గుర్తింపులో భాగంగా మంగళవారం సీపీఎం బృందం మండలంలోని దావాజిపల్లిని సందర్శించి ఉపాధి కూలీల సమస్యలపై ఆరా తీసింది. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం పేరు మార్చి పథకాన్ని నీరుగార్చిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా నిధులు ఖర్చుచేసే వారని.. కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వెచ్చించేలా నిబంధనలు విధించిందని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజువారీ కూలి రూ.600 చెల్లిస్తూ.. ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. మరో బృందం పార్టీ మండల కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో తెల్లరాళ్లపల్లి, కేతేపల్లిలో పర్యటించి ఉపాధి కూలీలు, స్థానిక సమస్యలపై ఆరా తీసింది. ఉపాధిహామీ పథకాన్ని రక్షించుకునేందుకు కలిసి పోరాడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూర్యవంశం రాము, దేవేందర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


