జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా
మూడు రోజుల్లో కేసుల నమోదు ఇలా..
● గోపాల్‌పేట పీఎస్ పరిధిలో మూడు ట్రాక్టర్లు, పెద్దమందడి పీఎస్ పరిధిలో జేసీబీపై కేసుల నమోదు, ఇసుక డంపుల సీజ్.
● పెబ్బేరు పీఎస్ పరిధిలో నాలుగు
ట్రాక్టర్లపై కేసులు
● వనపర్తి పట్టణ పీఎస్‌లో రెండు
ట్రాక్టర్లపై కేసుల నమోదు
● వనపర్తి రూరల్ పీఎస్ పరిఽధిలో రెండు ట్రాక్టర్లపై..
● ఖిల్లాఘనపురం పీఎస్ పరిధిలో మూడు మట్టి ట్రాక్టర్లపై కేసులు
● మదనాపురం పీఎస్ పరిఽధిలో ఒక ట్రాక్టర్‌పై కేసు నమోదు
● సీఎం సమీక్ష తర్వాత
పోలీసుశాఖ ఉక్కుపాదం
● మూడు రోజుల వ్యవధిలోనే 38 ఇసుక ట్రాక్టర్లపై కేసులు
వనపర్తి: జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై పోలీసుశాఖ పటిష్ట నిఘా ఏర్పాటుచేసి, ఉక్కుపాదం మోపుతోంది. ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు 38 ఇసుక ట్రాక్టర్లతో పాటు వాగుల్లో ఉన్న ప్రొకెయిన్లు సీజ్ చేసి.. కేసులు నమోదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమార్కులు భారీగా నిల్వచేసిన ఇసుకను సైతం సీజ్ చేసి.. మండల రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేశారు. మట్టి వాహనాలను మైనింగ్‌శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. వారు క్యూబిక్ మీటర్ల కోలమానంగా జరిమానా విధిస్తుండటంతో జిల్లావ్యాప్తంగా అక్రమ దందాకు తెరలేపిన వారిలో భయం మొదలైంది. అనుమతి లేకుండా రోడ్డుపై ఇసుక ట్రాక్టర్లు రావడానికి ఆస్కారం లేనంతగా నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు.
సీఎం సమీక్ష తర్వాత..
రాష్ట్ర రాజధానిలో ఈ నెల 3న కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై సీరియస్‌గా స్పందించడం.. అక్రమ రవాణాను అదుపు చేయకుంటే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తుందనే అర్థ వచ్చేలా మాట్లాడటంతో కలెక్టర్ పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేశారనే చర్చ సాగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ఈ నెల 3 నుంచే జిల్లాలోని ఇసుక అక్రమ రవాణాపై పోలీసు అధికారులు కొరడా ఝుళిపించడం గమనార్హం. ఆయా మండలాల్లో ఎస్‌హెచ్‌ఓలు జల్లెడ పట్టి మరీ ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
అత్యధికంగా తూంకుంట నుంచి..
జిల్లాలో అత్యధికంగా వీపనగండ్ల మండలం తూంకుంట ఇసుక రీచ్ నుంచి అనధికారికంగా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ దందా సాగుతున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లా పోలీస్ బాస్ అక్కడి ఎస్‌ఐని అప్రమత్తం చేశారు. దీంతో ఈ నెల 5న ఒకే రోజు 9 ట్రాక్టర్లలో ఎలాంటి అనుమతి లేకుండా వాగు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.


