● ప్రతిరోజు పిల్లలకు ఇలాగే పెడుతున్నారా?
● మెనూ పాటించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం
● హెచ్‌ఎం, ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు
కందనూలు: తాను జిల్లాలోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించినప్పటికీ.. ఇంత నాసిరకం భోజనం ఎక్కడా తినలేదని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలికల పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, మెనూ అమలు లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం మెనూలో భాగంగా కిచిడీ, గుడ్డు, మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ ఇవ్వాల్సి ఉండగా.. వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే వడ్డిస్తున్నట్లు గమనించారు. మెనూ ఎందుకు పాటించలేదని హెచ్‌ఎంను ప్రశ్నించారు. అలాగే విద్యార్థులకు వడ్డించిన అన్నం, సాంబార్ నాణ్యత సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం సరిగా వండలేదు.. సాంబార్ పసుపు నీళ్లలా ఉందని దుయ్యబట్టారు. రోజూ పిల్లలకు ఇలాగే భోజనం పెడుతున్నారా.. అన్నం ఎలా వండాలో కూడా తెలియదా..? అంటూ ఉపాధ్యాయులను మందలించారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఎందుకు మిమ్మల్ని విధుల నుంచి సస్పెండ్ చేయకూడదో చెప్పాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయురాలిని నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి, ఫుడ్ చెకింగ్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డీఈఓ రమేష్‌కుమార్‌కు ఫోన్‌లో ఆదేశించారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉందని ఈ నెల రోజులు సమయాన్ని వృథా చేయకుండా బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఆర్డీఓ సురేష్‌బాబు తదితరులున్నారు.


