లింగాల: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీఎంహెచ్‌ఓ రవికుమార్ వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన లింగాలలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీహెచ్‌సీలోని వివిధ విభాగాలను సందర్శించి రోగులతో మాట్లాడారు. అలాగే రికార్డులను పరిశీలించారు. సీహెచ్‌సీ, పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్లు పచ్చదనం, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో రోగులు తాగునీటికి ఇబ్బందులు పడకుండా నీటి వసతిని కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రతి పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు, సబ్ సెంటర్ల దగ్గర వైరస్ కార్నర్, లేదా పాకెట్లను అందుబాటులో ఉంచాలని వైద్యులకు చెప్పారు. ఆస్పత్రుల నిర్వహణ విషయంలో అలసత్వం వహించకుండా విధులను నిర్వహించాలని తేల్చిచెప్పారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వ్యాధి నిరోధక నిర్మూలన అధికారి సురేష్‌బాబు, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్, సికిల్ సెల్ ప్రోగ్రాం అధికారి ప్రదీప్, ప్రత్యేక వైద్య నిపుణులు, సీహెచ్‌సీ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


