‘హెచ్‌పీవీ’తో గర్భాశయ క్యాన్సర్‌ నివారణ | - | Sakshi
Sakshi News home page

‘హెచ్‌పీవీ’తో గర్భాశయ క్యాన్సర్‌ నివారణ

Mar 9 2026 7:41 AM | Updated on Mar 9 2026 7:41 AM

అచ్చంపేట రూరల్‌/ఉప్పునుంతల: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ నివారణ కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఉచితంగా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. ఆదివారం అచ్చంపేట ప్రాంతీయ ఆస్పత్రి, ఉప్పునుంతల సీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 9–14 ఏళ్లలోపు బాలికలు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌ కారక వైరస్‌ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అనంతరం జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే కేక్‌ కట్‌చేసి.. మహిళా వైద్యులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.రవికుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.తారాసింగ్‌, డీసీహెచ్‌ రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేందర్‌, సర్పంచ్‌ చింతగాళ్ల శ్రీనివాసులు, నాయకులు కట్టా అనంతరెడ్డి, తిప్పర్తి నర్సింహారెడ్డి, అంతటి మల్లేశ్‌ పాల్గొన్నారు.

ముంపు నుంచి కాపాడండి

చారకొండ: గోకారం ఎత్తిపోతల పథకం సామర్థ్యం తగ్గించి ముంపు ముప్పు నుంచి ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను కాపాడాలని నిర్వాసితులు కోరారు. ఈ మేరకు ఆదివారం కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి విన్నవించారు. గోకారం ఎత్తిపోతల పథకం సామర్థ్యం తగ్గించి.. తమ గ్రామాలను ముంపు ముప్పు నుంచి మినహాయించాలని మూడు నెలలుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై ఎంపీ మల్లు రవి స్పందిస్తూ.. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సమీక్షలో ఎర్రవల్లి, ఎర్రవల్లితండా ప్రజల సమస్యను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ఎంపీపీ సాంబయ్యగౌడ్‌, నిర్వాసితులు పెద్దయ్య, పర్వతాలు, ప్రకాశ్‌, పర్వతాలు, లాలూనాయక్‌, సంజీవ నాయక్‌, రాంపాల్‌, మోత్య, బిక్కు దేవేందర్‌ పాల్గొన్నారు.

వ్యవసాయంలో

మహిళల పాత్ర పెరగాలి

బిజినేపల్లి: వ్యవసాయంలో మహిళల పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఉందని పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ ఎల్‌.కృష్ణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మహిళా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయంలో అత్యాధునిక యాంత్రీకరణ పద్ధతులతో రైతులకు అధిక రాబడి వస్తుందన్నారు. మహిళా రైతులు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి.. పాడి పరిశ్రమ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, సేంద్రియ వ్యవసాయం వంటి వాటితో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. వ్యవసాయం ప్రతి మహిళ జీవితంలో భాగం కావాలని.. పొల్లాల్లోనే కాకుండా ఇంటి పరిసరాల్లో కూడా వ్యవసాయం చేయవచ్చన్నారు. దానినే పెరటి వ్యవసాయం అంటారని తెలిపారు. కోళ్లు, చేపలు, గొర్రెల పెంపకంతో పాటు పండ్ల తోటలు, పట్టు పురుగుల పెంపకం వంటి ఎన్నో రంగాలు ఉన్నాయని.. వీటి ఉత్పత్తులను తగిన విధంగా ప్రాసెసింగ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేయవచ్చన్నారు. పూర్వం ప్రతి మహిళ జీవితంలో వ్యవసాయం ఒక భాగంగా ఉండేదని.. ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఆధునికంగా తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సేంద్రియ వ్యవసాయం, వివిధ పంటల్లో అధిక దిగుబడులు, పరిశోధనల్లో సత్ఫలితాలు సాధించిన మహిళా రైతులను ఆయన శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కాడ సిద్దప్ప, డా.పద్మశ్రీ, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement