● కృష్ణానదిలో మన వాటా నీటిలో బొట్టు కూడా వదిలిపెట్టం
● రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
● సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం
● హాజరైన ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 20 నెలల్లో పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి పాలమూరులోని ముఖ్యమైన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టుల పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు కృష్ణానదిలో ఉన్న హక్కు మేరకు నీటిని పూర్తిగా వినియోగించుకుంటామని, ఒక్క బొట్టు కూడా వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందన్నారు. వచ్చే ఏడాది కాలంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టంపాడుకు రూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.185 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేసేందుకు భూ సేకరణ, పునరావాస చర్యలను వేగవంతం చేస్తున్నామని వివరించారు.
జూరాల ప్రాజెక్టు డీసిల్టింగ్
జూరాల ప్రాజెక్టులో డీసిల్టింగ్ పనులను వెంటనే చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆదేశించారు. 1995లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొదట 11.94 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నా.. మట్టిపూడిక కారణంగా ప్రస్తుతం 9 టీఎంసీలకు చేరిందన్నారు. డీసిల్టింగ్ ద్వారా తీసే ఇసుకను గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇటీవల వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 148.5 లక్షల మె.ట., ధాన్యం ఉత్పత్తి నమోదు కావడం దేశంలోనే రికార్డు అన్నారు. అలాగే సుమారు 72 లక్షల మె.ట., ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేశామని చెప్పారు. సమావేశంలో ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ఈ.శ్రీధర్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.


