కందనూలు: బాలికల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమ వైరస్) వ్యాక్సిన్ అందిస్తుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారించవచ్చన్నారు. జిల్లాలో మొత్తం 5,267 మంది 14 ఏళ్ల బాలికలు ఉండగా.. జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు కల్వకుర్తి, అమ్రాబాద్, ఉప్పునుంతల, లింగాల, అచ్చంపేట, కొల్లాపూర్ సివిల్ ఆస్పత్రుల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు బాలికలకు తప్పనిసరిగా టీకా వేయించాలని కోరారు.
ఏఎన్‌ఎంలకు సన్మానం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక జనరల్ ఆస్పత్రిలో కలెక్టర్ సంతోష్ ఏఎన్‌ఎంలను సన్మానించారు. అనంతరం ఆశావర్కర్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యరంగంలో మహిళల పాత్ర మరింత బలపడాలన్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.రవినాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శేఖర్, డా.రోహిత్ తదితరులు పాల్గొన్నారు.


